బీజేపీ వర్సెస్ ఆరెస్సెస్... మరింత ఆజ్యం పోసిన నడ్డా?

ప్రధానంగా మోడీ రెండోసారి పీఎం అయిన తర్వాత ఈ పగుళ్లు మరింత పెద్దగా మారాయని చెబుతున్నారు

Update: 2024-05-25 06:55 GMT

భారతీయ జనతా పార్టీకి బ్యాక్ బోన్ ఎవరంటే టక్కున చెప్పే పేరు ఆరెస్సెస్ అని. సంఘ్ పరివార్ లేకపోతే నేడు మోడీ పరివార్ ఈ స్థాయిలో ఉండేది కాదనేది వారంతా చెప్పే మాట! అయితే... గత కొంతకాలంగా ఆరెస్సెస్ కి మోడీ నేతృత్వంలోని బీజేపీకి మధ్య సంబంధాలకు బీటలు వాలుతున్నాయని అంటున్నారు. ప్రధానంగా మోడీ రెండోసారి పీఎం అయిన తర్వాత ఈ పగుళ్లు మరింత పెద్దగా మారాయని చెబుతున్నారు.

అవును... గతంతో పోలిస్తే బీజేపీ పరిస్థితి ఇప్పుడు అంత గొప్పగా ఏమీ లేదనే వారే ఎక్కువ అనే సంగతి తెలిసిందే. పైగా గత కొన్ని రోజులుగా వస్తున్న సర్వేలు కూడా మోడీ క్రెడిబిలిటీ తగ్గుతుందని.. మాటలకూ చేతలకూ ఉన్న తేడాను ప్రజలు గ్రహించారని.. పైగా తనను తాను దైవాంశసంభూతుడిగా అభివర్ణించుకునేవరకూ పరిస్థితి వెళ్లిపోవడం మానసిక సమస్య అని ప్రత్యర్థుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే... ప్రధాని మోడీ వ్యవహార శైలిపై బీజేపీ వెన్నుముక ఆరెస్సెస్ కినుక వహించిందని అంటున్నారు. ఇప్పుడు తమకు మోడీ బొమ్మ చాలు, ఆరెస్సెస్ అవసరం లేదన్నట్లుగా పలువురు బీజేపీ పెద్దల వైఖరి ఉందనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి.

తాజాగా ఆరెస్సెస్, బీజేపీ ల గురించి మాట్లాడిన నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఆరెస్సెస్ ఒక సాంస్కృతిక సంస్థ మాత్రమేనని.. బీజేపీ అనేది రాజకీయ సంస్థ అని.. ఈ విషయంలో ఎవరి పనులు వారికుంటాయని అన్నారు. అక్కడితో ఆగని ఆయన... బీజేపీ ఇక స్వయంగా నడుస్తుందన్నట్లుగా నడ్డా బహిరంగంగా వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

వాస్తవానికి బీజేపీ రాజకీయ పార్టీ అయినప్పటికీ దాని సిద్ధాంతకర్త ఆరెస్సెస్ అనేది అంతా చెప్పేమాట. నేడు బీజేపీ ఈ స్థాయికి ఎదిగిందంటే అందులో ఆరెస్సెస్ పాత్ర అత్యంత కీలకం అనే కాదనలేని సత్యం! అయితే... మోడీ ప్రధాని అయిన తర్వాత బీజేపీకి - ఆరెస్సెస్స్ మధ్య ఉన్న సంబంధాలు తగ్గిపోతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే సంఘ్ పరివార్‌ వర్సెస్ మోడీ పరివార్‌ మధ్య కొంత కాలంగా ఆధిపత్య పోరు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతుందని అంటున్నారు.

ఇందులో భాగంగానే మోడీ అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత ఆరెస్సెస్ అభిమానం పొందిన సీనియర్‌ నాయకులు ఒక్కొక్కరిని పక్కన పెడుతూ వస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అద్వానితో ప్రారంభమైన ఈ పరంపర తర్వాత గడ్కరీ, రాజ్ నాథ్‌ ల వరకూ విస్తరించబోతోందని అంటున్నారు. మరి చినికి చినికి గాలివానగా మారుతున్నట్లు చెబుతున్న ఆరెస్సెస్ వర్సెస్ మోడీ పరివార్ మధ్య వ్యవహారం ఏ పరిణామాలకు దారి తీయబోతోందనేది వేచి చూడాలి!

Tags:    

Similar News