నాకు కోపమే రాదు.. పెళ్లై 45 ఏళ్లైంది.. నవ్వులు పూయించారు
రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ తన మీద తానే వేసుకున్న జోక్ సభలో నవ్వులు పూయించేలా చేశారు
గడిచిన కొద్ది రోజులుగా విపక్షాల నిరసనలతో అట్టుడుకుతోంది పార్లమెంట్. దీంతో.. ఎలాంటి చర్చలు జరగకుండానే సభలు అర్థాంతరంగా వాయిదా పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మణిపూర్ ఉదంతం ఈ పరిస్థితికి కారణం. ఇదిలా ఉంటే.. రోటీన్ కు కాస్తంత భిన్నమైన సీన్ రాజ్యసభలో గురువారం చోటు చేసుకుంది.
కొద్ది రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పెద్దల సభలో.. రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ తన మీద తానే వేసుకున్న జోక్ సభలో నవ్వులు పూయించేలా చేశారు. దీంతో.. వాడి వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అసలేం జరిగిందంటే..
రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గే.. మీకు ఎందుకు పదే పదే కోపం ఎందుకు వస్తుందంటూ విపక్ష నేత సూటిగా ప్రశ్నించారు. దీనికి అనూహ్యమైన సమాధానం ఇచ్చారు రాజ్యసభ ఛైర్మన్. 'సర్.. నాకు అసలు కోపమే రాదు. ఎందుకంటే నాకు పెళ్లై 45 ఏళ్లు అయ్యింది' అంటూ తన మీద తానే జోక్ వేసుకోవటంతో రాజ్యసభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి.
తన మీద వేసుకున్న జోక్ ను అక్కడితో ఆపని రాజ్యసభ ఛైర్మన్.. తన కోపంపై మరింత వివరణ ఇచ్చే ప్రయత్నంలోనూ నవ్వులు పూసేలా చేవారు. కాంగ్రెస్ సభ్యుడు చిదంబరంను ఉద్దేశిస్తూ.. ''ఆయన చాలా సీనియర్ లాయర్.
అథారిటీపై కోపం చూపే హక్కు మాకుండదని ఆయనకు బాగా తెలుసు. సభలో మీరే అథారిటీ. మరో విషయం. నా భార్య ఎంపీ కాదు. కనుక ఆమె గురిచి నేనిలా సభలో మాట్లాడటం సరికాదు' అంటూ వ్యాఖ్యానించటంతో వాతావరణం చల్లబడింది. తనకు కోపం పదే పదే వస్తుందన్న విషయాన్ని సవరించాలని ఖర్గేను కోరారు.
దీంతో స్పందించిన ఆయన.. ''మీకు కోపం రాదు. చూపిస్తారంతే. నిజానికి మీకు చాలాసార్లు లోలోపల కోపిగించుకుంటారు కూడా' అంటూ చేసిన వ్యాఖ్యతో సభలో మరోసారి నవ్వులు విరబూసాయి. మొత్తంగా గడిచిన కొద్ది రోజులుగా ఎలాంటి చర్చ జరగకుండా.. కేవలం నిరసనతో, ఆందోళనలతో సాగుతున్న సభలో భిన్నమైన సన్నివేశం ఆవిష్క్రతమైంది.