అయ్యో పాపం: వైసీపీ గెలుపుపై రూ.30 కోట్ల బెట్.. అప్పులతో ఆత్మహత్య
రాజకీయాల మీద ఆసక్తి ఉండటం తప్పు లేదు. అయితే.. హద్దులు దాటేలా ఉండే రాజకీయ అభిమానం మొదటికే మోసం తీసుకొస్తుంది
రాజకీయాల మీద ఆసక్తి ఉండటం తప్పు లేదు. అయితే.. హద్దులు దాటేలా ఉండే రాజకీయ అభిమానం మొదటికే మోసం తీసుకొస్తుంది. రాజకీయాల్లో ఉంటూ ప్రజల మనసుల్లో ఏమనుకుంటున్నారు? ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉందన్న విషయాన్నిగుర్తించాల్సిన అవసరం పొలిటికల్ ఫ్యామిలీస్ కు ఉన్నాయి. ఆ అంచనాల విరుద్దంగా వ్యవహరిస్తే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల విషయంలో రాజకీయనేతలు పలువురు వ్యవహరించిన తీరు ఆందోళనకు గురి చేసేలా మారింది. తాజాగా ఒక విషాద ఉదంతం ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తూ ఒక సర్పంచ్ భర్త రూ.30 కోట్ల మేర పందెలు కాశారు. అయితే.. ఫలితం భిన్నంగా రావటంతో పందెం డబ్బుల్ని తిరిగి ఇవ్వలేని పరిస్థితి నెలకొని.. మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్న వైనం సంచలనంగా మారింది. నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి ఏడో వార్డు సభ్యుడు. ఆయన సతీమణి సర్పంచ్ గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరు వైసీపీకి బలమైన మద్దతుదారులు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రూ.30 కోట్ల వరకు పందెం వేశారు. ఫలితాలు ఎలా వచ్చాయో తెలిసిందే. ఈ నేపత్యంలో వారు ఊరు విడిచి వెళ్లారు. తాము బెట్ కట్టిన వైసీపీ ఘోరంగా ఓడిపోవటంతో వారు ఇంటికి తిరిగి రాలేదు. పందెం వేసిన వారు ఫోన్లు చేస్తే ఆన్సర్ చేయలేదు. దీంతో.. ఆగ్రహించిన వారు వారి ఇంటికి వెళ్లి తలుపులు బద్ధలు కొట్టి ఏసీలు.. సోఫాలు.. మంచాలు తదితర వస్తువులు తీసుకెళ్లిపోయారు.
ఈ క్రమంలో ఊరికి వచ్చిన ఆయన జరిగింది తెలుసుకొని తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఆదివారం పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే తన భర్త కొద్దిరోజులుగా మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారని.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఉదంతం నియోజకవర్గంలో షాకింగ్ గా మారింది.