మళ్లీ కొట్టేసుకున్నారు... అసెంబ్లీలో రగడ!
ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని అధికార పక్షం ఎమ్మెల్యేలు, అలా చేయడానికి వీల్లేదని బీజేపీ ఎమ్మెల్యేలు.. వాదులాటకు దిగి.. తర్వాత మరోసారి కొట్టేసుకున్నారు.
దాదాపు 10 సంవత్సరాల తర్వాత.. తొలిసారి ఎన్నికలు జరిగిన జమ్ము కశ్మీర్‌లో అధికార , ప్రతిపక్ష ఎమ్మె ల్యేలు కొట్టేసుకున్న విషయం తెలిసిందే. గురువారం రోజు రోజంతా జమ్ము కశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు అత్యంత ఉత్కంఠగా, ఉద్రిక్తంగా మారాయి. ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. ఈ పరిణా మం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే.. దేశం మొత్తం కలవర పడినప్పటికీ.. ఎమ్మెల్యేలు మాత్రం తమ తీరు మార్చుకోకపోవడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం 2021లో జమ్ము కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా.. జమ్ము కశ్మీర్ లో ఎవరైనా నివశించడంతోపాటు.. అక్కడి వారితో సంబంధ బాంధవ్యాలు కూడా కొనసాగించవచ్చు. అదేవిధంగా అక్కడ ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. వియ్యం కూడా అందుకోవచ్చు. మొత్తం దేశానికి ఎలాంటి నిబంధనలు వర్తిస్తున్నాయో.. జమ్ము కశ్మీర్‌లోనూ అవే వర్తిస్తాయి.
అయితే.. ఇలా ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని అధికార పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) తప్పుబడుతోంది. ఎన్నికల సమయంలోనూ దీనిని రాజకీయంచేసింది. తాము వస్తే.. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని హామీ కూడా ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనిని చేపట్టింది. అయితే.. దీనిని వ్యతిరేకిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యేలు 21 మంది తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార పక్షానికి మద్దతిస్తు న్న పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) సభ్యులకు బీజేపీ సభ్యులకు మధ్య వాగ్వాదం.. తోపులాట చోటు చేసుకుని ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. అయినా.. ఎమ్మెల్యేలు మాత్రం తమ పట్టు వీడలేదు. శుక్రవారం మరోసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. ఇదే విషయంపై ఇరు పక్షాల ఎమ్మెల్యేలు నినాదాలతో హోరెత్తించారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని అధికార పక్షం ఎమ్మెల్యేలు, అలా చేయడానికి వీల్లేదని బీజేపీ ఎమ్మెల్యేలు.. వాదులాటకు దిగి.. తర్వాత మరోసారి కొట్టేసుకున్నారు. దీంతో సభను వాయిదా వేసిన స్పీకర్.. అలజడికి కారణమైన వారిని సస్పెండ్ చేయాలని నిర్ణయించారు.