కొడుకు కోసం కురు వృద్ధ నేత జానారెడ్డి ఏం చేస్తున్నారంటే...?

జానారెడ్డి కాంగ్రెస్ లో కురు వృద్ధ నేత. ముఖ్యమంత్రి సీటు కోసం ఎదురుచూస్తున్నట్లుగా ప్రకటించుకున్న నేత

Update: 2023-11-10 02:02 GMT

జానారెడ్డి కాంగ్రెస్ లో కురు వృద్ధ నేత. ముఖ్యమంత్రి సీటు కోసం ఎదురుచూస్తున్నట్లుగా ప్రకటించుకున్న నేత. ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. తన రాజకీయ వారసుడిగా కుమారుడిని రంగంలోకి దింపారు. జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ సీటు నుంచి బరిలో ఉన్నారు. దాంతో ఈ సీఎం స్థాయి నేత నాగార్జున సాగర్ ని వదలడంలేదు.

తన కుమారుడిని ఆశీర్వదించాలంటూ జనంలోకి వెళ్తున్నారు. కలియ తిరుగుతున్నారు. తాను ఎన్నో సార్లు గెలిచి నియోజకవర్గానికి ఎంత మేలు చేశానో కూడా వివరిస్తున్నారు. తాను చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుతం ఏమీ జరగడంలేదని కూడా జానారెడ్డి విమర్శిస్తున్నారు.

ఇక జానారెడ్డి విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచారు. 2018 దాకా ఆయన విపక్ష నేతగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఇక ఆయన మీద బీయారెస్ నుంచి నోముల నరసయ్య పోటీ చేసి గెలిచారు. ఆయన మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో సైతం జానారెడ్డి పోటీకి దిగితే నోముల నరసయ్య కుమారుడు భగత్ ఆయన్ని ఓడించారు.

ఇక ఇపుడు సార్వత్రిక ఎన్నికల్లో జానారెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. తన కుమారుడిని పోటీకి పెట్టారు. అయితే ఇటు బీయారెస్ నుంచి భగత్ మళ్లీ నిలబడ్డారు. అటు జనారెడ్డి కుమారుడు జైవీర్ పోటీలో ఉన్నారు. ఇలా చూస్తే ఇద్దరు నేతల్లూ యువకులే. దాంతో ఎన్నికల సమరం ఆకట్టుకునేలా ఉంది.

ఇక్కడే పెద్దరికంతో జానారెడ్డి రంగంలోకి వస్తున్నారు. కుమారుడి పక్షాన ప్రచారం చేస్తూ బీయారెస్ నుంచి నేతలను లాగేసుకుంటున్నారు. జానారెడ్డికి గ్రామీణ ప్రాంతంలో పట్టు ఉంది. దాంతో బీయారెస్ లో ఉన్న వారిని ఇటు వైపునకు తిప్పుకుంటున్నారు.

తాను ప్రజలకు ఎంతో మేలు చేశాను అని చెప్పుకుంటున్న జానారెడ్డి ఇంకా చేయాల్సిన అభివృద్ధిని తన కుమారుడు జైవీర్ రెడ్డి పూర్తి చేస్తారు అని అంటున్నారు. నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ మాత్రమే గెలవాలని అపుడే అభివృద్ధి సాధ్యపడుతుంది అని అంటున్నారు. ఇక చూస్తే భగత్ యువకుడు రాజకీయంగా కొత్త ఉప ఎన్నికల్లో అంతా కలసి గెలిపించారు.

ఇపుడు ఆయనే వ్యూహాలను రచించుకుని పోటీ చేయాల్సి ఉంటుంది. దాంతో ఆయన ఒంటరిగానే రంగంలో ఉన్నారు. కానీ జై వీర్ రెడ్డికి మాత్రం జానారెడ్డి కొండంత అండగా ఉన్నారు. దాంతో పాటు కాంగ్రెస్ గాలి కొంత ఉంది. ఈ పరిణామాల నేపధ్యంలో భగత్ వర్సెస్ జై వీర్ రెడ్డిలలో ఎవరిది విజయం అన్నది చర్చకు వస్తోంది. ఇక ఎన్నికలు చూస్తే కనుక జానారెడ్డి అభ్యర్ధిగా ఉన్నారా అన్న డౌట్లు వస్తున్నాయి మరి.

Tags:    

Similar News