21 మంది జనసేన ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా ఉందా ?

అయితే జనసేన ఇంతటి విజయం సాధించినా ఆ ఇంపాక్ట్ కూటమి ప్రభుత్వంలో ఏమైనా కనిపిస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది.

Update: 2024-09-06 11:31 GMT

ఏపీలో ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో నూరు శాతం స్ట్రైక్ తో గెలిచిన పార్టీగా జనసేన రికార్డుని క్రియేట్ చేసింది. జనసేన ఆ విధంగా ట్రెండ్ సెట్టర్ అయింది. ఆ పార్టీ మీద జనాలకు మోజు ఎంతో కూడా అర్థమైంది. పవన్ కళ్యాణ్ సెంట్ పర్సెంట్ స్ట్రైకింగ్ ఉండాలని పదే పదే ఇచ్చిన పిలుపుకు జనసేన వర్గాలతో పాటు ప్రజలు కూడా సీరియస్ గా తీసుకుని ఇంతటి అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు అని అంటున్నారు.

అయితే జనసేన ఇంతటి విజయం సాధించినా ఆ ఇంపాక్ట్ కూటమి ప్రభుత్వంలో ఏమైనా కనిపిస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది. సాధారణంగా బ్రహ్మాండమైన విజయాలు సాధించిన పార్టీలకు ప్రభుత్వంలోనూ ఫుల్ ఫోకస్ ఉంటుంది.

అయితే జనసేనలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరికీ ఆ రకమైన ట్రీట్మెంట్ ఉందా అన్నదే చర్చగా ఉంది. జనసేన ఎమ్మెల్యేలు గెలిచినా కూడా తమ సొంత నియోజకవర్గాలలో ఇబ్బందులే పడుతున్నారు అని అంటున్నారు. ఎందుకంటే జనసేన ఇపుడు గెలిచిన సీట్లు అన్నీ ఒకపుడు టీడీపీ కంచుకోటలు.

దాంతో దశాబ్దాలుగా బలంగా ఉన్న టీడీపీ అక్కడ పాతుకుని పోయింది. ఆ పార్టీ నియోజకవర్గాల ఇంచార్జులే అసలైన ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. వారికి అన్ని విషయాల మీద అవగాహన ఉండడంతో వారు సమస్యలను గుర్తిస్తున్నారు. పనులు కూడా అధికారుల వద్ద చాలా ఈజీగా చేయించుకో గలుగుతున్నారు అని టాక్ నడుస్తోంది.

చాలా నియోజకవర్గాలో చూస్తే జనసేన ఎమ్మెల్యేలు పేరుగా అన్నట్లుగా ఉన్నారని అంటున్నారు. వారు డమ్మీలుగా మిగిలిపోయారు అని కూడా అంటున్న నేపథ్యం ఉంది. తమకు ఉన్న సంస్థాగత బలంతో అనుభవంతో ఇతరత్రా బలంతో టీడీపీ జనసేనను పూర్తిగా డమ్మీగా చేస్తోంది అని కామెంట్స్ పడుతున్నాయి.

కొత్తగా ఏ పనులు చేయాలన్నా నియోజకవర్గంలో ఏది చిన్న పని నుంచి పెద్ద పని జరగాలి అన్నా టీడీపీతోనే అవుతోంది అని అంటున్నారు. అధికారులు సైతం టీడీపీకే ఎక్కడ లేని విలువ ఇస్తున్నారు. మరి చేతిలో ఎమ్మెల్యే పదవి ఉండి ఏమి లాభం అని వాపోవడం జనసేన ఎమ్మెల్యే వంతు అవుతోంది.

ఉమ్మడి విశాఖ జిల్లా ఒక నియోజకవర్గంలో తన మాట నెగ్గడం లేదని ఏకంగా గన్ మెన్ లను ప్రభుత్వానికి జనసేన ఎమ్మెల్యే ఒకరు సరెండర్ చేశారు అని ప్రచారం కూడా సాగుతోంది. ఆయన సీఐ పోస్టులకు తాను ప్రతిపాదించిన పేర్లను పక్కన పెట్టి టీడీపీ వారు చెప్పిన వాటికే ఆమోదముద్ర వేశారు అని అసంతృప్తి చెందారు అని అంటున్నారు.

ఇలా అధికారుల బదిలీల విషయంలో కానీ నచ్చిన పోలీసు అధికారులను తెచ్చుకునే విషయంలో కానీ అలాగే నియోజకవర్గంలో పనులు చేయించుకోవడంలో కానీ జనసేన మాట అయితే నెగ్గడం లేదు అన్నది చాలా మంది చెప్పుకుంటున్న విషయం.

ఇక టీడీపీ ఏపీలో అధికారంలో ఉండడం ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నేత ఉండడంతో తమ్ముళ్లకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. మరి కొన్ని నియోజకవర్గాలలో చూస్తే జనసేనను పక్కన పెట్టి మరీ టీడీపీ నేతలే దూకుడు చేస్తున్న నేపథ్యం ఉంది.

ఇంకొన్నొ చోట్ల బాహాటం అయిపోతున్నారు. తమకే పనులు చేయాలని కూడా అధికారుల మీద ఒత్తిడి పెడుతూండడంతో కూడా జనసేన నేతలకు పాలు పోవడం లేదుట. ఇదంతా ఎందుకు అంటే 2029 నాటికి తమ సీట్లలో జనసేన బలపడకుండా చేయడానికే అని అంటున్నారు. అంటే కేవలం అయిదేళ్ల పాటు తమ నియోజకవర్గాన్ని అద్దెకి ఇచ్చాం తప్ప మొత్తం కాదని తమకే నియోజకవరం సొంతం అన్నట్లుగా తమ్ముళ్ళు వ్యవహరిస్తున్న తీరుతో జనసేనకు చిర్రెత్తుకుని వస్తోందిట.

మరి ఇది మెల్లగా మొదలైంది. అసంతృప్తి కాస్తా తీవ్ర స్థాయిలోకి చేరి దావానలంగా మారితే మాత్రం చాలా పెద్ద చిచ్చు ప్రతీ చోటా రాజుకోవడం ఖాయమని అంటున్నారు. ఈ రెండు పార్టీల విషయంలో పెద్దలు కూర్చుని నచ్చచెప్పినా కుదిరేది కాదు, ఎందుకంటే లోకల్ పాలిటిక్స్ లో ఎవరికి వారు పెత్తనం చేయాలని అనుకుంటారు. అందుకే ఒకే చోట రెండు పార్టీలు ఇమడవు అని అంటున్నారు.

Tags:    

Similar News