సమన్వయ రాజకీయం: తెనాలిలో ఆలింగనం... జగ్గంపేటలో జగడం!
ఈ పొత్తు ప్రకటన అనంతరం జనసేనలో కీలమైన కొంతమంది నేతలు పార్టీకి రాజీనామాలు పంపారు. ఈ సందర్భంగా నాదెండ్లపైనా, పవన్ పైనా ఫైరయ్యారు.
గెలుపు అనివార్యం.. గెలవని పక్షంలో కనీసం ఒకపార్టీ అయినా మాయం.. అనే కామెంట్లు నిన్నమొన్నటి వరకూ ఏపీ రాజకీయాల్లో వినిపించేవి. రాబోయే ఎన్నికల ఫలితాల అనంతరం కనీసం ఒక పార్టీ అయినా మనుగడను ప్రశ్నార్ధకం చేసుకుని చరిత్ర పుటల్లో మిగిలిపోయే ప్రమాధం లేకపోలేదనే కామెంట్లు వినిపిస్తుండేవి! ఈ సమయంలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. అయితే, అధినేతలు పొత్తు సరే కానీ.. గ్రౌండ్ లెవెల్ లో నేతలు మాత్రం కుస్తీలు పడుతున్నారు!
అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటంతో పవన్ కళ్యాణ్ కదిలిపోయారు, కరిగిపోయారు! ఆ సమయంలోనే టీడీపీతో పొత్తు ఆలోచన వచ్చిందని చెబుతూ... బాబుతో ములాకత్ అనంతరం కలిసే పోటీ చేస్తామని ప్రకటించేశారు. అయితే... ఆ సమయంలో కేడర్ గురించిన ఆలోచన పక్కకుపోయిందనే కామెంట్లు వినిపించాయి. తాజాగా అవి తెరపైకి వస్తున్నాట్లున్నాయి!
ఈ పొత్తు ప్రకటన అనంతరం జనసేనలో కీలమైన కొంతమంది నేతలు పార్టీకి రాజీనామాలు పంపారు. ఈ సందర్భంగా నాదెండ్లపైనా, పవన్ పైనా ఫైరయ్యారు. మరికొంతమంది పార్టీలోనే ఉంటూ సర్ధుకుపోతున్నారు! ఈ సమయంలో సీట్ల సర్ధుబాటుపై క్లారిటీ ఇవ్వకుండా మొదలుపెట్టిన సమన్వయ కమిటీ సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. ఫలితంగా... టీడీపీ - జనసేన పొత్తు వ్యవహారం సరికొత్త సమస్యగా మారుతున్నట్లు కనిపిస్తుంది.
తెనాలిలో ఆలపాటి - నాదెండ్ల ఆలింగనం:
జనసేనలో ఏకైక నెంబర్ టూ గా పేరు సంపాదించుకుని.. పార్టీ భవిష్యత్తుపై తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న నాదెండ్ల మనోహర్ ఇటీవల తెనాలిలో పోటీచేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తెనాలి నుంచే తాను పోటీ చేస్తున్నట్లు టీడీపీ నేత ఆలపాటి రాజా కూడా ప్రకటించారు! దీంతో... టీడీపీ - జనసేన కూటమిలో తెనాలి అభ్యర్థి ఎవరనేది పెద్ద ప్రశ్నగానే మారింది. కట్ చేస్తే... తాజాగా ఇద్దరూ కౌగిలించుకున్నారు!
తాజాగా తెనాలిలో టీడీపీ - జనసేన నాయకుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ లు నియోజకవర్గ బాధ్యుల హోదాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెనాలి సీటు ఆశిస్తున్న ఇద్దరు నేతలూ ఆలింగనం చేసుకున్నారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం కలిసిపనిచేయాలని కేడర్ కు పిలుపునిచ్చారు. ఇక ఫైనల్ గా ఇక్కడి నుంచి పోటీచేసేది ఎవరనేది "అగ్ర నాయకత్వం" ప్రకటిస్తుందని చెప్పుకొచ్చారు!
ప్రస్తుతానికి తెనాలి నియోజకవర్గంలో అటు టీడీపీ, ఇటు జనసేన కు సంబంధించి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి! ఈ కౌగిలింతల మాటున కడుపులో కత్తులు ఉన్నాయా లేవా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం! ఆ సంగతి అలా ఉంటే ... మరోపక్క ఇప్పటికే అనకాపల్లి, పిఠాపురం నియోజకవర్గాల్లో జరిగిన సమన్వయ సమావేశాలు రచ్చ రచ్చగా మారాయి! అక్కడ జరిగిన వ్యవహారాలను పరిశీలిస్తే... సమస్య పెద్దదే అనిపించకమానకపోవచ్చు!
జగ్గంపేటలో జ్యోతుల జగడం!:
ఈ సమయంలో తాజాగా జగ్గంపేటలో జరిగిన జనసేన - టీడీపీ ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చగా మారింది. ఈ సమావేశంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జనసేన ఇన్ ఛార్జ్ గా పాఠంశెట్టి సూర్యచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైకందుకున్న నెహ్రూ... జగ్గంపేట సీటు తమదే అని, పవన్ కల్యాణ్ కూడా తనవైపే ఉన్నాడని అన్నారు. దీంతో... ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోయింది!
అనంతరం ఒకవేళ జనసేన ఇన్ ఛార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్రకు జగ్గంపేట ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయిస్తే.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చే ప్రసక్తే వుండదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తనకు టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకున్నా బరిలో వుంటానని జ్యోతుల నెహ్రూ తేల్చి చెప్పారని అంటున్నారు. దీంతో సూర్యచంద్ర తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు!
ఇందులో భాగంగా... జ్యోతుల నెహ్రూపై సమావేశ మందిరంలోనే జనసేన నేత విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ కు, జనసేన ఇన్ ఛార్జ్ సూర్యచంద్రకు మధ్య తోపులాట జరిగిందని తెలుస్తుంది. దీంతో... టీడీపీ, జనసేన శ్రేణులు కొట్టుకున్నారని సమాచారం! దీంతో... ఇలాంటి సంఘటనలు తెరపైకి వచ్చినప్పుడు... టీడీపీ - జనసేన పొత్తు ఫ్యూచర్ పై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం!