ఒకే ఇంటిపేరున్న వారికే రెండేసి టికెట్లు...!?
ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు నాలుగు అసెంబ్లీ టికెట్లు కన్ ఫర్మ్ గా దక్కుతాయని ప్రచారంలో ఉంది
ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు నాలుగు అసెంబ్లీ టికెట్లు కన్ ఫర్మ్ గా దక్కుతాయని ప్రచారంలో ఉంది. అవి ప్రజారాజ్యం టైం లో ఆ పార్టీ గెలిచిన సీట్లనే జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ అధినాయకత్వం అంగీకరించింది అని అంటున్నారు.
ఆ సీట్లు భీమునిపట్నం, గాజువాక. పెందుర్తి, ఎలమంచిలి అని తెలుస్తోంది. ఈ నాలుగు సీట్లకు జనసేన నుంచి ఆశావహులు చాలా మంది ఉన్నారు. అయితే ఒకే ఇంటి పేరున్న వారికే రెండేసి టికెట్లు దక్కుతాయని ప్రచారంలో ఉంది.
జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పంచకర్ల రమేష్ బాబు ఉన్నారు. ఆయన ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీలలో పనిచేసిన మీదట జనసేనలో చేరారు. ఆయనకు పెందుర్తి టికెట్ ఖరారు అయింది అని అంటున్నారు. అదే పంచకర్ల ఇంటి పేరు కలిగిన మరో జనసేన నేత పంచకర్ల సందీప్ కి భీమునిపట్నం టికెట్ ఇస్తారని అంటున్నారు.
ఇపుడు మరో ఇంటిపేరు సుందరపు వారికి కూడా రెండు టికెట్లు దక్కుతాయని అంటున్నారు. సుందరపు సతీష్ కుమార్ కి గాజువాక టికెట్ ఇస్తే సుందరపు విజయ్ కుమార్ కి ఎలమంచిలి టికెట్ ఇస్తారు అని అంటున్నారు. విజయ్ కుమార్ చాలా కాలంగా పార్టీలో ఉన్నారు. 2019లో ఎలమంచిలిలో జనసేన తరఫున పోటీ చేసి ఓడారు.
సతీష్ కుమార్ ఇటీవల జనసేనలో చేరారు. ఆయన గాజువాక టికెట్ కోసమే చేరారు అని అంటున్నారు. ఆ హామీ తీసుకునే ఆయన పార్టీలోకి వచ్చారు అని అంటున్నారు. అలా ఉమ్మడి విశాఖ టికెట్లు జనసేనలో పంచకర్ల సుందరపు ఇంటిపేర్ల వారికి రిజర్వ్ అయిపోయాయి అని అంటున్నారు.
ఈ ప్రచారాలు ఊహాగానాల నేపధ్యంలో పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారు ఖంగు తింటున్నారు. తాము ఆది నుంచి పార్టీలో ఉన్నామని తమకు టికెట్లు దక్కవా అని వారు ఆవేదన చెందుతున్నారు. పోటీ చేయాలని ఉబలాటపడుతున్న వారు మాత్రం ఏమైనా మార్పు చేర్పులు ఉంటాయా అని చూస్తున్నారు.