గ్రాఫిక్స్ కాదు... చంద్రబాబు మెడలో జనసేన కండువా!

పొత్తు రాజకీయాలు, కూటమి పంచాయతీల సమయంలో రకరకాల దృశ్యాలు దర్శనమిస్తుంటాయి.

Update: 2023-12-30 09:52 GMT

పొత్తు రాజకీయాలు, కూటమి పంచాయతీల సమయంలో రకరకాల దృశ్యాలు దర్శనమిస్తుంటాయి. 2018 తెలంగాణ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని రీతిలో నిర్ణయం తీసుకున్న చంద్రబాబు... అక్కడ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సమక్షంలో ఒక మహిళ చంద్రబాబు మెడలో కాంగ్రెస్ కండువా కప్పారు. దీంతో నాడు "చంద్రబాబు మెడలో కాంగ్రెస్ కండువా" అనే విషయం వైరల్ గా మారింది. ఈ సమయంలో జనసేన కండువా వంతు వచ్చింది!

అవును... ఏపార్టీకి వ్యతిరేకంగా అయితే టీడీపీ ఆవిర్భవించిందో.. ఏ పార్టీ పాలనపై ఆ పార్టీ వ్యవస్థాపకులు స్వరీయ నందమూరి తారకరామారావు పోరాటం చేశారో.. ఏ పార్టీ పాలను తెలుగు గడ్డపై దుబ్బయట్టారో అదే పార్టీ కండువాను టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు మెడలో కనిపించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టు, విడుదల కు ముందు ఈ ఏడాది సుమారు 8సార్లు కుప్పంలో పర్యటించిన ఆయన... తాజాగా మరోమారు కుప్పం పర్యటనలో ఉన్నారు. వైసీపీ ఈ దఫా కుప్పాన్ని కొట్టాలని బలంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో... బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

ఈ సమయంలో తాజాగా జనసేన నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జనసేన కేడర్ టీడీపీతో కలిసి పనిచేయాలని, చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తన దృష్టికి తేవాలని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మెడలో జనసేన జెండా దర్శనమిచ్చింది. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

ఇటీవల హిందూపురంలోని సమన్వయ కమిటీ మీటింగుల్లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ మెడలో జనసేన జెండా కనిపించిన సంగతి తెలిసిందే. అనంతరం జై జనసేన అని బాలయ్య తనదైన స్టైల్లో నినాదాలు చేశారు. ఈ క్రమంలో తాజాగా కుప్పంలో చంద్రబాబుని కలిసిన జనసేన నాయకులు చంద్రబాబుకు తమ పార్టీ కండువాను కప్పారు. దీంతో ఈ పిక్ వైరల్ గా మారింది.

మొన్న తెలంగాణలో చంద్రబాబు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే.. ఇటీవల బాలయ్య జనసేన కండువా కప్పుకుని జై జనసేన అని అన్నారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు మెడలో జనసేన కండువా కనిపించడంతో తమ్ముళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పవన్ కల్యాణ్ మేడలో ఏనాడైనా పసుపు జెండా కనిపించిందా అంటూ ఆన్ లైన్ లో సెర్చ్ మొదలుపెట్టారు!

కాగా... గత ఎన్నికల్లో టీడీపీ 23 స్థానలకే పరిమితం అవ్వడం.. ఆ సమయంలో మరికొంతమంది టీడీపీ నేతలను తమ పార్టీలో ఆహ్వానిస్తే టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడాదక్కదని వైసీపీ నేతల నుంచి కామెంట్లు వినిపించిన నేపథ్యంలో... ఒక ఎడిటెడ్ పిక్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అందులో వైసీపీ అధినేత వైఎస్ జగన్... చంద్రబాబు మెడలో వైసీపీ కండువా కప్పు పార్టీలోకి ఆహ్వానిస్తుంటారు! అయితే అది గ్రాఫిక్ పిక్ కాగా... ఇప్పుడు జనసేన కండువా మాత్రం నిజం కావడం గమనార్హం!

Tags:    

Similar News