జనసేన ప్రజాకోర్టులా ?

తొందరలోనే జనసేన ఆధ్వర్యంలో ప్రజాకోర్టులు ఏర్పాటుచేయబోతున్నట్లు పార్టీ అదినేత పవన్ కల్యాణ్ చెప్పారు.

Update: 2023-08-16 06:27 GMT

వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అరాచకాలకు వ్యతిరేకంగా తొందరలోనే జనసేన ఆధ్వర్యంలో ప్రజాకోర్టులు ఏర్పాటుచేయబోతున్నట్లు పార్టీ అదినేత పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రజాకోర్టులు అన్నది మావోయిస్టుల పదజాలం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టులు ప్రజా ప్రతినిదులపైనో లేకపోతే స్ధానిక నేతలపై ఉన్న ఆరోపణలపైన విచారణ చేస్తారు. మావోయిస్టులు నిర్వహించే ప్రజాకోర్టులు చట్టవిరుద్ధం. వీటిని పోలీసులు అనుమతించరు. విచిత్రం ఏమిటంటే తాము ఏ గ్రామంలో అయితే ప్రజాకోర్టులను నిర్వహించాలని అనుకుంటున్నారో ఆ గ్రామానికి మాత్రమే తెలిసేట్లుగా మావోయిస్టులు జాగ్రత్తలు తీసుకుంటారు.

సాధారణంగా ఎవరి విషయంలో అయితే ప్రజాకోర్టును ఏర్పాటుచేశారో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటమో లేకపోతే అక్కడికక్కడే శిక్షవేసేయటమో జరుగుతుంది. ఈమధ్య జరిగిన ప్రజాకోర్టంటే అరకు నియోజకవర్గంలో ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎంఎల్ఏ సివేరి సోమాను మావోయిస్టులు కాల్చి చంపేయటమే. మావోయిస్టులు నిర్వహించే ప్రజాకోర్టులో విచారణుండదు, వాదనలుండవు. కేవలం ఆరోపణలు వినిపిస్తారు తీవ్రతను బట్టి వెంటనే శిక్షను అమలుచేసేస్తారు. అందుకనే మావోయిస్టులు నిర్వహించే ప్రజాకోర్టులంటే నేతల్లో అంత భయం.

మరి తాజాగా పవన్ చెప్పే ప్రజాకోర్టుల మాటేమిటి ? తొందరలో మొదలవ్వబోయే ప్రజాకోర్టులను ఎలా నిర్వహిస్తారు ? వైసీపీ నేతల అక్రమాలు, అవినీతి, దోపిడిపై ప్రజలకు తెలియజేయటానికే ప్రజాకోర్టులు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. దీనికి ప్రజాకోర్టులనే పేరెందుకు ? ఇపుడు పవన్ ఊరూరా తిరిగి చేస్తున్నదదే కదా. వారాహియాత్ర కావచ్చు మరో యాత్ర కావచ్చు పవన్ పర్యటనల్లో చేస్తున్నదంతా ఇదే కదా.

పవన్ ఎక్కడ మాట్లాడినా, ఏమిమాట్లాడినా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కదా మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలను చైతన్యవంతులను చేయటం కోసమే కదా ప్రత్యేకించి వారాహియాత్రలని చేస్తున్నది. ఇన్నిరకాలుగా ప్రభుత్వాన్ని ఒకవైపు ఎండగడుతు మళ్ళీ ప్రత్యేకించి ప్రజాకోర్టులు ఎందుకు నిర్వహించాలని అనుకుంటున్నారో పవనే చెప్పాలి. ప్రజాకోర్టులు అనగానే అది నెగిటివ్ గా వెళిపోతుంది జనాల్లో. దాని నిర్వహణ విషయంలో పోలీసులతో ఘర్షణ మొదలవుతుంది జనసేన నేతలకు. మళ్ళీ అది లా అండ్ ఆర్డర్ సమస్యకు దారితీస్తుంది. ఇదంతా అవసరమా పవన్ కు. ఇపుడు చేస్తున్నట్లుగానే చేసుకుంటు పోతే సరిపోదా ?

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు