జానీకి జనసేన షాక్‌!

షూటింగ్‌కు సంబంధించిన వాహనంలోనూ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది.

Update: 2024-09-16 13:19 GMT

టాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన పార్టీ నేత జానీ మాస్టర్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ మేరకు ఆయన వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ గా పనిచేసిన ఒక యువతి జానీ మాస్టర్‌ పై కేసు పెట్టింది. 2019 ఢీ షో ప్రోగ్రామ్‌ లో భాగంగా ఆయనతో కలిసి ముంబై వెళ్లినప్పుడు ఆయన తనపై అత్యాచారం చేశారని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం చేయడమే కాకుండా మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించారని ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారని ఆరోపించింది. షూటింగ్‌కు సంబంధించిన వాహనంలోనూ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది.

ఆగస్టు 28న అనుమానాస్పద పార్శిల్‌ తన ఇంటి ముందు ఉందని.. దానిపై ‘ఇదే నీ చివరి షూటింగ్‌’ అని రాసి ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. తనకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని.. జానీ మాస్టర్‌ నుంచి ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు హైదరాబాద్‌ లోని రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్‌ పై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఫిర్యాదును నార్సింగి పోలీసు స్టేషన్‌ కు బదిలీ చేశారు. దీంతో నార్సింగ్‌ పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఫిర్యాదు చేసిన యువతి 2017 నుంచి ఆయన వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ గా పనిచేస్తోంది.

కాగా జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కు జానీ మాస్టర్‌ వీరాభిమాని. ఆ పార్టీ తరఫున ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయనను స్టార్‌ క్యాంపెయినర్‌ గా నియమించారు. పలు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తరఫున జానీ మాస్టర్‌ ప్రచారం చేశారు. అంతేకాకుండా పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ తరఫున కూడా ప్రచారం నిర్వహించారు. తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు నుంచి సీటును ఆశించినా పవన్‌ సీటు ఇవ్వలేదు. తరచూ పవన్‌ పైన, మెగా ఫ్యామిలీపైన పలు వేదికలపై జానీ మాస్టర్‌ ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు.

యువతి ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్‌ పై జనసేన పార్టీ చర్యలకు దిగింది. ఆయనను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ లో ఆయనపై ఫిర్యాదు దాఖలైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే జానీ మాస్టర్‌ ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదు.

జానీ మాస్టర్‌పై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేయడం అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కాగా ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో జానీ మాస్టర్‌ కూడా పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అవి అధికారికంగా నిరూపణ కాలేదు.

Tags:    

Similar News