వైరల్ ఇష్యూ... జపాన్ బ్రీడింగ్ వీసా!
ఈ నేపథ్యంలో జపాన్ బ్రీడింగ్ వీసాలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథనం నెట్టింట హల్ చల్ చేస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలకు అధిక జనాభా సమస్య కాగా.. మరికొన్ని దేశాలకు అల్ప జనాభా, తగ్గుతున్న జననాల రేటు మరింత పెద్ద సమస్యగా మారుతుంది. దీంతో... పిల్లలకు జన్మనిచ్చే దంపతులకు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి పలు దేశాల ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో జపాన్ బ్రీడింగ్ వీసాలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథనం నెట్టింట హల్ చల్ చేస్తుంది.
అవును... తగ్గుతున్న జననాల రేటును ఎదుర్కోడానికి, జపాన్ విదేశీయులకు "బ్రీడింగ్ వీసాలు" అందించడం ప్రారంభించిందంటూ ఓ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ పోస్ట్ ను నెటిజన్లు తెగ షేర్ చేస్తూ, లైకులు కొడుతూ, హౌ టు అప్లై అని సెర్చ్ మొదలు పెట్టేశారని అంటున్నారు. ఇది తీవ్ర ఆసక్తికర విషయంగా మారిపోయింది!
వాస్తవానికి ప్రస్తుతం జపాన్ లో వేగంగా వృద్ధాప్యం, తగ్గుతున్న జనన రేటు దశాబ్ధాలుగా సమస్యగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో... ఈ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినా... ఇంతవరకూ ఏదీ పెద్దగా సఫలం కాలేదు. దీంతో... ఈ బ్రీడింగ్ వీసాల ఆలోచన తెరపైకి వచ్చిందని అంటున్నారు.
ఈ మేరకు జపాన్ ప్రభుత్వ యాక్సిలరేటెడ్ ఫ్యామిలీ బ్యూరో (ఏ.ఎఫ్.బీ) నుంచి ఈ తాజాగా అలోచన వచ్చిందని చెబుతుండగా.. ఈ ఏడాది చివరి నుంచి ఈ తరహా వీసాలు జారీ చేయడాన్ని ప్రారంభించనున్నట్లు సదరు పోస్ట్ లో పేర్కొన్నారు! దీనికి సంబంధించి అర్హతలు, టెరమ్స్ & కండిషన్స్ త్వరలో వెల్లడించనున్నట్లు చెబుతున్నారు.
ఏ.ఎఫ్.బీ. రూపొందించిన ప్రణాళికల ప్రకారం... టూరిస్ట్, వర్క్, ఫ్యామిలీ వీసాలా మాదిరిగానే ఈ బ్రీడింగ్ వీసాలు అందించబడతాయని అంటున్నారు. ఇదే సమయంలో... వీటి ప్రాసెసింగ్ మరింత వేగవంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఇదే సమయంలో... ధరఖాస్తుదారులు అన్ని ప్రయాణ ఖర్చులపైనా రీయింబర్స్ మెంట్ పొందుతారని అంటున్నారు.
అయితే ఈ సంతానోత్పత్తి వీసాలను పొందినవారు.. తమ వల్ల కనీసం ఒక గర్భం అయినా వచ్చినట్లు అక్కడ రుజువును అందించాల్సి ఉంటుందంట. అలా చేయలేనివారు జపాన్ నుంచి బయలుదేరే సమయంలో 50,000 యెన్ లకు తక్కువ కాకుండా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
అయితే... దీనిపై వాస్తవాస్తవాలను పరిశీలిస్తే... ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తేలింది! ఇలాంటి ప్రకటన ఏదీ జపాన్ ప్రభుత్వం నుంచి రాలేదని స్పష్టం అయ్యింది! ఫలితంగా... జూలై నెలలో "ఏప్రిల్ ఫూల్" అని అర్థమవుతోంది!