సెలవు పెట్టి వెళ్లిపోయిన జవహర్ రెడ్డి.. కొత్త సీఎస్ ఎవరు?

ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి.. వివాదాస్పదంగా వ్యవహరించిన కీలక స్థానాల్లోని అధికారులకు

Update: 2024-06-06 13:45 GMT

ఏపీలో రాజకీయ పరిణామాలు.. పాలనా పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఓవైపు ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు తలమునకలై ఉన్నారు. ఓవైపు కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఏర్పాటుకు సంబంధించినఅంశాల్లో బిజీగా ఉన్న ఆయన.. మరోవైపు రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టే విషయంలో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తనకున్న పాలనా అనుభవంతో గత ప్రభుత్వంలో తనకు ఎదురైన ఎన్నో అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో.. గతానికి భిన్నంగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి.

ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి.. వివాదాస్పదంగా వ్యవహరించిన కీలక స్థానాల్లోని అధికారులకు.. విభాగ అధిపతులకు సెలవులు సైతం రద్దు చేయటం.. డిప్యుటేషన్ మీద వెళ్లిపోతామంటే నో చెప్పటం లాంటి ఆదేశాలు జారీ అయ్యేలా చేశారు. అదే సమయంలో పలు కీలక ఫైళ్లు పక్క దారి పట్టకుండా ఉండేందుకు వీలుగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు అయ్యేలా చేస్తున్నారు.

గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి.. తాజాగా తనను కలిసేందుకు వస్తున్న వారిని కలిసేందుకు ఇష్టపడని చంద్రబాబు తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా వ్యవహరించిన జవహర్ రెడ్డి ని సెలవుపై వెళ్లాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. దీంతో ఆయన సెలవు పెట్టేసి వెళ్లిపోయారు.

జవహర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఆయన వ్యవహరశైలి మీద చంద్రబాబు పలు విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ సైతం సెలవుపై వెళ్లారు. అయితే.. తాను అనారోగ్య కారణాల మీద లీవ్ పెట్టినట్లుగా చెబుతున్నారు. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిన నేపథ్యంలో కొత్త సీఎస్ ఎంపిక సాయంత్రం లోపు జరుగుతుందని భావిస్తున్నారు.

మరోవైపు.. గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన వారిని తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి ముందే పలు ఉత్తర్వులు జారీ అవుతాయని భావిస్తున్నారు. పాలన పరమైన ప్రక్షాళనను పూర్తి చేసి.. ఆ పై ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలో టీచర్ల బదిలీలపై ఎన్నికల కోడ్ ముందు ఇచ్చిన ఉత్తర్వులను కూడా నిలిపేశారు. ఎలాంటి బదిలీలు చేపట్టొద్దని ఆదేశించారు. ఎన్నికలకు ముందు మొత్తం 1800 మంది టీచర్లను బదిలీ చేయాలని చెప్పగా.. వీటిల్లో పెద్ద ఎత్తున పైరవీలు.. సిఫార్సులు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో బదిలీల్ని నిలిపేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.

Tags:    

Similar News