యూఎస్‌ లో జడ్జిగా ఏపీ మహిళ... తెలుగు స్పీచ్ వైరల్!

తెలుగులో మాట్లాడటాన్ని నామోషీగా భావించే అర్ధజ్ఞానులకు చెంపపెట్టనే కామెంట్లనూ సొంతం చేసుకున్న పరిస్థితి!

Update: 2024-05-25 03:51 GMT

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులు తమ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని టాప్ కంపెనీలకు సీఈవో లుగా పనిచేస్తుండటంతోపాటు.. యూఎస్, యూకే ల్లో రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా అమెరికాలో న్యాయమూర్తిగా ఓ తెలుగు మహిళ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె తెలుగులో మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.

అవును.. భారత సంతతికి చెందిన జయ బాడిగ అనే మహిళ ఆమెరికా కాలిఫోర్నియాలో కౌంటీ సుపీరియర్‌ కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఫలితంగా... ఇటువంటి అత్యున్నత పదవిని అలంకరించిన తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించారు. ఇదే సమయలో... ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రమాణ స్వీకారం కూడా నెట్టింట సంచలనంగా మారింది.

ఇందులో భాగంగా... ఆమె తెలుగులో మాట్లాడుతూ, సంస్కృత శ్లోకాలు పఠిస్తూ.. న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రధానంగా... సభను ఉద్దేశించి మాట్లాడుతూ... "మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం" అంటూ ఆమె మాట్లాడిన మాటలు.. ఎంత ఎత్తుకెదిగినా ఎన్నటికీ మూలాలను మర్చిపోకూడదనే విషయాన్ని చాటి చెప్పినట్లుగా ఉన్నాయి!

ఏదేశ మేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్లుగా... ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్లకు పైగా ప్రజలు మాట్లాడే మాతృభాష తెలుగులో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలకాలని కోరుకున్నాను అని చెప్పడం.. తెలుగులో మాట్లాడటాన్ని నామోషీగా భావించే అర్ధజ్ఞానులకు చెంపపెట్టనే కామెంట్లనూ సొంతం చేసుకున్న పరిస్థితి!

ఇలా సాగిన ఆమె ప్రసంగం పూర్తి అయిన వెంటనే కరతాళధ్వనులతో సభికులంతా ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

జయ బాడిగ నేపథ్యం!:

తాజాగా ఆమెరికా కాలిఫోర్నియాలో కౌంటీ సుపీరియర్‌ కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయిన జయ బాడిగ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడ నగరం! అనంతరం ఆమె శాంటా క్లారా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని, బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్‌ లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశారు.

Tags:    

Similar News