మంత్రి జోగి రమేశ్ ఫోటోగ్రాఫర్ మిస్సింగ్ మిస్టరీ ఇదేనా?
ఏపీ రాష్ట్ర మంత్రి జోగి రమేశ్ పర్సనల్ ఫోటోగ్రాఫర్ 28 ఏళ్ల ఆదినారాయణ మిస్ అయిన ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే
ఏపీ రాష్ట్ర మంత్రి జోగి రమేశ్ పర్సనల్ ఫోటోగ్రాఫర్ 28 ఏళ్ల ఆదినారాయణ మిస్ అయిన ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గడిచిన మూడు రోజులుగా అతగాడి ఆచూకీ తెలియకపోవటం.. తాను సూసైడ్ చేసుకుంటున్నట్లుగా పెట్టిన నోట్ తో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. అతని ఆచూకీ కనుగునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎట్టకేలకు అతను బెదిరింపులకు పాల్పడుతున్నాడే తప్పించి ఆత్మహత్య చేసుకోలేదని.. పక్కదారి పట్టించేలా ప్లాన్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
పెడన పోలీసుల కథనం ప్రకారం గడిచిన నాలుగేళ్లుగా మంత్రి జోగి రమేశ్ వద్ద పర్సనల్ ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఆదినారయణ బీటెక్ పూర్తి చేశాడు. మంత్రికి విశ్వాసపాత్రుడిగా ఉండటంతో అతడ్ని తన వద్ద పర్సనల్ ఫోటోగ్రాఫర్ గా పెట్టుకున్నాడు. మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాతి కాలంలో క్రికెట్ బెట్టింగులు.. ఇతర వ్యసనాలతో పక్కదారి పట్టాడు. ఈ క్రమంలో అందినకాడికి అప్పులు చేశాడు. మంత్రి వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ కావటంతో పలువురితో ఉన్న పరిచయాలతో దాదాపు రూ.కోటికి పైనే అప్పులు చేసినట్లుగా చెబుతున్నారు.
అప్పు ఇచ్చిన వారు తమ డబ్బుల్ని తిరిగి ఇచ్చేయాలన్న ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోవటంతో పరారీ తప్పించి మరో మార్గం లేకపోయింది. దీంతో.. అందరికి మస్కా వేసేందుకు వీలుగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా పేర్కొంటూ సూసైడ్ నోట తయారు చేశాడు. తన డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లొద్దని కోరాడు. తల్లిదండ్రులకు.. భార్యకు తనను క్షమించాల్సిందిగా కోరుకుంటూ లెటర్స్ రాశాడు. వీటిని ఈ నెల 25న వాట్సాప్ స్టేటస్ గా ఉంచి కనిపించకుండా పోయాడు.
దీంతో.. అతని కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. క్రిష్ణా నదిలో ఆత్మహత్య చేసుకొని ఉంటాడన్న అంచనాతో గాలింపులు చేపట్టారు. 27 వరకు అతని ఆచూకీ లభించలేదు. సాధారణంగా నదిలో ఆత్మహత్య చేసుకుంటే 36 గంటల్లో డెడ్ బాడీ ఒడ్డుకువస్తుంది. కానీ.. అలా జరగకపోవటంతో.. తమ విచారణ కోణాన్ని మార్చిన పోలీసులు.. అతను ఎక్కడ ఉండి ఉంటాడన్న కోణంలో విచారణ మొదలుపెట్టారు.
ఈ క్రమంలో 25 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చిన్నాపురం వద్ద ఒక సీసీ కెమేరాలో అతను టూవీలర్ మీద వెళుతున్నట్లుగా గుర్తించారు. బైక్ మీద రెండు బ్యాగులతో వెళుతూ.. ఫోన్ మాట్లాడుతున్నట్లుగా గుర్తించారు. దీంతో.. పలు సీసీ కెమేరాల్ని పరిశీలించగా అతను ఆత్మహత్య చేసుకోలేదని.. అవనిగడ్డ.. రేపల్లె మీదుగా పరారైనట్లుగా తేల్చారు. పక్కా ప్లాన్ లో భాగంగా అందరిని తప్పు దారి పట్టిస్తూ తాను చేరుకోవాలనుకున్న ప్రాంతానికి వెళ్లినట్లుగా తేల్చారు. అతని సెల్ ఫోన్ ను అప్పుడప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తూ ఉండటంతో అతన్ని ట్రేస్ చేయటం కష్టమవుతోంది. త్వరలోనే అతడ్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి సూసైడ్ నాటకంతో పోలీసులకు చుక్కలు చూపించినట్లుగా చెబుతున్నారు.