కెన్యాలో ఆదానీ గో బ్యాక్ !
భారతదేశంలో పోర్టులు, విమానాశ్రయాలు చేజిక్కించుకున్న ఆదానీ సంస్థ విదేశాలలోనూ విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.
‘ఆదానీ గో బ్యాక్ .. వుయ్ రిజెక్ట్ ఆదానీ’ అంటూ కెన్యా ఏవిఏషన్ అధారిటీ (కెఎఎ) కార్మికులు కెన్యా రాజధాని నైరోబీలోని జోమో కెన్వట్ట అంతర్జాతీయ విమానాశ్రయంలో సమ్మెకు దిగడంతో అక్కడ విమానాశ్రయ కార్యకలాపాలు నిలిచిపోయాయి. భారతదేశంలో పోర్టులు, విమానాశ్రయాలు చేజిక్కించుకున్న ఆదానీ సంస్థ విదేశాలలోనూ విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.
ఈ నేపథ్యంలోనే కెన్యాలోని జోమో కెన్యట్ట అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు 185 కోట్ల డాలర్లకు ఈ ఎయిర్‌పోర్టును 30 ఏండ్ల పాటు అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థకు లీజుకు ఇచ్చేందుకు కెన్యా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా అదానీ సంస్థ రెండో రన్‌వేను నిర్మించడంతో పాటు ప్రయాణికుల టెర్మినల్‌ను ఆధునీకరించాలి. అయితే, పబ్లిక్ టెండర్‌ను ఆహ్వానించకుండా అదానీ సంస్థ చేసిన ప్రతిపాదన ఆధారంగా ఈ ఒప్పందం ఖరారు కావడం గమనార్హం.
దీంతో ఎట్టి పరిస్థితులలో ఆదానీకి ఈ విమానాశ్రయం ఇవ్వడానికి అంగీకరించమని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఒప్పందాన్ని రహస్యంగా ఉంచుతున్నారని, అన్ని వివరాలు బయటకు ప్రభుత్వం ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. విమానాశ్రయం ప్రభుత్వ ఆస్తి అని, ఆదానికి అప్పగిస్తే లాభాల కోసం ప్రయాణికులపై భారం మోపుతారని, స్థానికులు ఉద్యోగాలు కోల్పోతారన్నది వారి వాదన. ఈ మేరకు అక్కడి సోషల్ మీడియాలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ, ప్రచారం జరుగుతున్నది. ఈ ఒప్పందంపై అభ్యంతరాల నేపథ్యంలో కెన్యా హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.
ఇంతకుముందు ఆస్ట్రేలియాలో ఆదాని మైనింగ్ కార్యకలాపాల మీద ఆందోళనలు జరగగా, శ్రీలంకలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏకంగా అల్లర్లు చెలరేగాయి. ఇక బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదాని నుండి విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోగా దీని మీదా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాజాగా కెన్యాలోనూ ఆందోళనలు జరుగుతుండడం గమనార్హం.