కడపలో చంద్రబాబు చేయిస్తున్న సర్వేలతో గందరగోళం

రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధిగా ఎవరుంటే బాగుంటుందనే విషయమై చంద్రబాబు అభిప్రాయసేకరణ చేయిస్తున్నారు.

Update: 2024-02-23 09:30 GMT

కడప జిల్లాలో చంద్రబాబునాయుడు చేయిస్తున్న సర్వేలతో గందరగోళం పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధిగా ఎవరుంటే బాగుంటుందనే విషయమై చంద్రబాబు అభిప్రాయసేకరణ చేయిస్తున్నారు. ఈ అభిప్రాయం కూడా మొబైల్ ఫోన్ల ఐవీఆర్ఎస్ విధానంలో చేయిస్తున్నారు. తాజా సర్వే మూడు నియోజకవర్గాలు ప్రొద్దుటూరు, కమలాపురం, రాజంపేటలో జరిగాయి. సర్వే విషయాలను పక్కనపెట్టేస్తే పార్టీల్లో గందరగోళం పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే ప్రొద్దుటూరులో టికెట్ కోసం నాలుగు స్తంబాలాట జరుగుతోంది. ప్రవీణ్ కుమార్ రెడ్డి, వరదరాజుల రెడ్డి, మల్లెల లింగారెడ్డి, సీఎం సురేష్ నాయుడు గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

తాజా సర్వే వరదరాజుల రెడ్డి అభ్యర్ధి అయితే ఎలాగుంటుందనే విషయం మీద జరిగినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. పాదయాత్ర సందర్భంగా లోకేష్ ప్రొద్దుటూరు యువగళంలో ప్రవీణ్ కుమార్ రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించారు. దానిమీదే లోకేష్ పై అందరు మండిపోతున్నారు. తాజా సర్వే వరదరాజులరెడ్డి పేరుమీద జరగటంతో మిగిలిన వారిలో టెన్షన్ పెరిగిపోతోంది. ఇక కమలాపురంలో నియోజకవర్గం ఇన్చార్జిగా పుత్తా నరసింహారెడ్డి ఉన్నారు. టికెట్ పుత్తాకే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.

అయితే తాజా సర్వే వీరశివారెడ్డి పేరుమీద సర్వే జరిగింది. దాంతో పుత్తా వర్గంతో పాటు ఇతర నేతల్లో కూడా అయోమయం పెరిగిపోతోంది. నియోజకవర్గం ఇన్చార్జిగా పుత్త ఉండగా మళ్ళీ వీరశివారెడ్డి పేరుపై సర్వే ఎందుకు చేయించారో నేతలకు అర్ధంకావటంలేదు. అదే విధంగా రాజంపేటలో గంటా నరహరి, బత్యాల చెంగల్రాయలు అభ్యర్ధిత్వాలపై సర్వే జరిగింది. దాంతో జనసేన నేతల్లో గందరగోళం మొదలైంది. ఎందుకంటే జనసేన పార్టీ తరపున శ్రీనివాసరాజు చాలాకాలంగా పనిచేసుకుంటున్నారు.

పొత్తులో రాజంపేట సీటును తమకు కావాలని పవన్ కల్యాణ్ అడిగితే చంద్రబాబు ఓకే చెప్పారట.ఈ విషయాన్ని రాజుకు పవన్ చెప్పి గట్టిగా పనిచేసుకోమని చెప్పారట. టికెట్ విషయంలో పవన్ నుండి హామీరావటంతో రాజు నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. అలాంటిది సడెన్ గా టీడీపీ నేతల పేర్లపై సర్వే జరగటంతో రెండుపార్టీల్లోను గందరగోళం మొదలైపోయింది. మొత్తంమీద ఐవీఆర్ఎస్ సర్వేలు పార్టీ నేతల్లో గందరగోళం పెంచేస్తున్నది మాత్రం వాస్తవం.

Tags:    

Similar News