ఓట్లు అమ్ముకోమంటూ షాకింగ్ !
ఓటుని నోటు అన్నది రేటు కట్టేసి బజారున ప్రజాస్వామ్యం పెట్టేసి చాలా దశాబ్దాలు గడచిపోయింది.
ఓటుని నోటు అన్నది రేటు కట్టేసి బజారున ప్రజాస్వామ్యం పెట్టేసి చాలా దశాబ్దాలు గడచిపోయింది. వర్తమానంలో ఓటుకు నోటు ఇస్తున్నారు అంటే అది ఇంత అని పలుకుతుంది అంటే అన్ని రకాలుగా పెరిగిన ధరలతో పాటే అదీనూ అని అనుకోవాల్సి వస్తోంది.
మీ ఓటుకు నా నోటు అంటూ దర్జాగా అపర కుబేరులు జనంలో పడి కొనుగోలు మాల్ ఆడేస్తున్నారు. గేట్లు తెరచి నగదుని పారించేస్తున్నారు. అది ఒక్కో చోట ఒక్కో రేటు. డిమాండ్ అండ్ సప్లైని బట్టి మారుతూ వస్తోంది. ఎక్కువ టైట్ ఉంటే పోటా పోటీ ఉంటే ఓటు గిరాకీ ఇంకా పెరుగుతోంది. ఇలా ఒక బిజినెస్ డీల్ టైప్ లో సాగిస్తోంది వ్యవహారం. అయితే అందరూ ఓటుకు నోటు అంటే అమ్ముడుపోరు అంటున్నారు. దానికి ఉదాహరణగా కాకినాడలో ఒక కుటుంబం తమ ఇంటి ముందు ఒక బోర్డు పెట్టేసి మరీ షాక్ ఇచ్చేసింది.
మా ఇంట్లో ఆరు ఓట్లు ఉన్నాయి. అయితే అవి అమ్మబడవు అంటూ రాసి ఇంటి ముందు వేలాడదీసిన ఆ బోర్డుని చూసిన రాజకీయ పార్టీకు నిజంగా ఖంగు తినాల్సిందే. ఎంతటి వారిని అయినా నోటుతో కొట్టేయవచ్చు అని భావించే వారికి ఇలాంటి బోర్డులు డేంజర్ సిగ్నల్స్ అని అంటున్నారు.
ఓట్లకు నోట్లు కుమ్మరించిన వారు ఆనక గెలిచిన తరువాత కనిపిస్తారా అంటే అది డౌట్ లేకుండా ఎవరికి వారుగా ఆలోచిస్తే తెలిసిన జవాబే. అందుకే దక్కిన కాడికి అనుకుంటూ చాలా మంది ఓటుకు నోటుని తీసుకుంటున్నారు. ఈ రోజు దాటిపోతే ఎటూ ఎవరూ కనిపించరు అని భావిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారూ ఉన్నారు.
కానీ ఇలాంటి అవినీతి విచ్చలవిడిగా జడలు విప్పుకుని వీధులలో డ్యాన్సులు చేస్తున్న వేళ కూడా ఇంకా నిజాయితీ పరులు ఉన్నారు అనడానికే ఆ బోర్డు. ఓటుని అమ్ముకోకూడదు అని చెప్పేందుకే ఆ బోర్డు. మాకు నచ్చిన వారికి ఓట్లు వేసుకుంటాం, కానీ నోటుతో మా ఓటుని కొట్టకండి మా మనోభావాలు దెబ్బతింటాయని డేరింగ్ గా చెప్పేవారు ఎందరు అన్నది ఒక ప్రశ్న.
అలా చేసిన కాకినాడలోని ఆ కుటుంబాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. సాటి వారు సైతం అదే స్పూర్తిగా తీసుకుని ఆచరిస్తున్నారు. ఇలా ప్రతీ వీధిలో ఇంటికొక బోర్డు వేలాడితే చాలు మిగిలిన వారు సిగ్గుతో అయినా ఓటుకు నోటు చస్తే తీరుకోరు అని ప్రజాస్వామ్య ప్రియులు అంటున్నారు. ఓటు వేయడం బాధ్యత. దానికి కూడా డబ్బులు తీసుకుని ఎవరినో గెలిపించేందుకు నీవెందుకు భాయ్. నోటే గెలిచిన చోట నీ మాటెందుకు భాయ్ అంటూ అంతరాత్మ నిగ్గదీసే రోజు తొందరలోనే వస్తుందని ఆశించాల్సిందే.