డిప్యూటీ స్పీకర్ గా కాల్వ శ్రీనివాసులు ?
ఆ విధంగా టీడీపీ డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా తీసుకుంటే ఆ పార్టీ తరఫున ఎవరు అన్నది కూడా చూస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఏపీలో 16వ శాసనసభ కొలువు తీరింది. తొలి రోజే ఏకంగా 172 మంది ఎమ్మెల్యేల చేత సీనియర్ ఎమ్మెల్యే రాజకీయ కురువృద్ధుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. మధ్యాహ్నానికే ఈ కార్యక్రమం మొత్తం సజావుగా పూర్తి అయింది. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలూ ప్రమాణం చేశారు. ఇక ప్రమాణం చేయకుండా మిగిలిన వారిలో ముగ్గురూ టీడీపీ ఎమ్మెల్యేలే కావడం విశేషం. వారు అందుబాటులో లేకపోవడం వల్లనే హాజరు కాలేదు అని అంటున్నారు.
వారు శనివారం ప్రమాణం చేస్తారు అని టీడీపీ వర్గాలు తెలియజేశాయి. ఇక స్పీకర్ గా ఏడు సార్లు గెలిచి అసెంబ్లీకి వచ్చిన సీనియర్ నేత ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన పాత్రుడు పేరిట ఒకటే నామినేషన్ దాఖలు అయింది. అసెంబ్లీ సెక్రటరీని దానికి కూటమి సభ్యులు అందించారు.
దాంతో అయ్యన్న స్పీకర్ గా ఏకగ్రీవంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ విషయంలో ఎవరు అన్న చర్చ సాగుతోంది. కూటమిలోని జనసేనకు బీజేపీకి ఈ పదవి ఇస్తారా అన్నది కూడా టాక్ నడుస్తోంది. కానీ టీడీపీ ఆలోచనలు చూస్తే ఈ పదవిని తామే తీసుకోవాలని చూస్తోంది అని అంటున్నారు.
ఆ విధంగా టీడీపీ డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా తీసుకుంటే ఆ పార్టీ తరఫున ఎవరు అన్నది కూడా చూస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. సమర్ధత చాటుకున్నారు. ఈసారి సామాజిక రాజకీయ సమీకరణ నేపధ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.
దాంతో చంద్రబాబు ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని భావించారు అని అంటున్నారు. దాంతో కాల్వకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తారు అని అంటున్నారు. అదే విధంగా చూస్తే ఆయన బోయ సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత. సీమ జిల్లాలలో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుందని అందుకే కాల్వ పేరుని ఎంచుకున్నారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా సాగితే కాల్వ పేరునే డిప్యూటీ స్పీకర్ గా ఖరారు చేస్తారు అని అంటున్నారు.