వైసీపీని మూడు పార్టీలూ పంచుకుంటున్నాయి !

వైసీపీ నేతలను సింహ భాగం టీడీపీ తీసుకుంటూంటే కొందరు కీలక నేతలను జనసేన తీసుకుంటోంది.

Update: 2024-08-28 01:30 GMT

వైసీపీని ఒంటరిని చేసి మూడు పార్టీలూ పంచేసుకుంటున్నాయి. ఇందులో కూడా మిత్రులు తమదైన బలానికి తగినట్లుగా రాజకీయ నిష్పత్తిని పాటిస్తున్నాయి. వైసీపీ నేతలను సింహ భాగం టీడీపీ తీసుకుంటూంటే కొందరు కీలక నేతలను జనసేన తీసుకుంటోంది. ఇంకా మిగిలిన నేతలను బీజేపీ తీసుకుంటోంది.

కూటమిలో మేమేమి తక్కువ తిన్నామా అన్నట్లుగా కమలనాధులు కూడా వైసీపీని గురి పెట్టారు. వైసీపీలో మంచి నేతలకు బీజేపీ తలుపులు తీసి స్వాగతం పలుకుతున్నామని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామంటే చేర్చుకోవడానికి అభ్యంతరం లేదని ఆమె తేల్చేశారు.

దాంతో తొలి బోణీగా విజయవాడకు చెందిన కార్పోరేటర్ ని చేర్చుకున్నారు. నిజానికి విజయవాడలోని ఎక్కువ మంది కార్పోరేటర్లు టీడీపీలోకి వెళ్లారు. ఇక అర కొరగా మిగిలిన వారికి బీజేపీ గేలం వేస్తోంది అని అంటున్నారు. దీంతో తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 39వ వార్డుకు చెందిన గుడివాడ నరేంద్ర రాఘవ బీజెపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పటికే ఇదే పశ్చిమ నియోజకవర్గంలోని వైసీపీ కార్పోరేటర్లు మైలవరపు రత్నకుమారి, మైలవరపు లావణ్య మాధురి, హర్షద్ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని నాయకత్వంలో టీడీపీలో చేరిపోయారు. ఇపుడు బీజేపీ ఇక్కడ తొలి బోణీ అలా కొట్టింది అన్న మాట.

విజయవాడ పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి నాయకత్వంలో ఈ చేరిక జరిగింది. ఇంకా చాలా మంది కూటమిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు అని సుజనా చౌదరి చెప్పారు. ఎవరు వచ్చినా విజయవాడ ప్రగతి కోసం అయితే కచ్చితంగా తీసుకుంటామని సుజనా చౌదరి అన్నారు.

ఇదిలా ఉంటే టీడీపీలోకి అయితే ఏకంగా ఎలూరు మేయర్ చేరిపోయారు. ఆమెతో పాటు పెద్ద ఎత్తున వైసీపీ కార్పోరేటర్లు చేరడంతో ఏలూరులో వైసీపీ పూర్తిగా లేకుండా పోయింది. విశాఖ కార్పోరేషన్ లో ఇదే పరిస్థితి ఉంది. మెజారిటీ కూటమికే అక్కడ ఉంది.

ఇదే తీరున ఏపీలఒని చాలా కార్పోరేషన్లకు కూటమి వైపు టర్న్ అయ్యేలాగానే ఉంది. వైసీపీకి గేలం వేసి తమ వైపు తిప్పుకోవాలని కూటమిలోని మూడు పార్టీలూ ప్రయత్నం చేస్తున్నాయి. దాంతో ఒంటరి అయిన వైసీపీ ఏమీ చేయలేకపోతోంది.

ఇక వైసీపీ అధినాయకత్వం అయితే ఉండేవారు ఉంటారు వెళ్లేవారు వెళ్తారు అన్నట్లుగానే వ్యవహరిస్తోంది. ఈ రోజులలో పదవుల కోసం అధికారం కోసమే ఎవరైనా రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అందువల్ల వారంతా అధికారం వైపుకే చూస్తారు. అయితే వారిలో కొందరిని అయినా బుజ్జగించి భవిష్యత్తు మీద ఆశలు కల్పిస్తే ఉంటారు అని పార్టీలో కొందరి భావన. కానీ అలాంటి ప్రయత్నాలు వద్దు అన్నదే అధినాయకత్వం ఆలోచన అని చెబుతున్నారు. మొత్తానికి వైసీపీని తలో వైపు నుంచి కూటమి పార్టీలు టార్గెట్ చేస్తున్న నేపధ్యంలో వైసీపీ లోకల్ బాడీస్ లో పూర్తిగా ఖాళీ అవుతుందా అన్న చర్చ ముందుకు వస్తోంది.

Tags:    

Similar News