అప్పుడు హిల్లరీ భర్త.. ఇప్పుడు కమల భర్త!
ఈ ఏడాది నవంబర్ లో అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది నవంబర్ లో అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ.. డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్ రంగంలోకి దిగుతున్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య వాడివేడిగా విమర్శలు సాగుతున్నాయి. ఇంతకూ కమల.. బ్లాకా (నల్ల జాతీయురాలు), భారతీయురాలా అని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు కమల సైతం ఆయనకు దీటుగా స్పందిస్తున్నారు. ట్రంప్ వర్ణ వివక్షతో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
కాగా కమలా హారిస్ కు ఇబ్బందికర పరిణామం ఎదురైంది. గతంలో తాను వివాహేతర సంబంధం నడిపానని ఆమె భర్త డగ్లస్ ఎంహోప్ బాంబుపేల్చారు. తన మొదటి వివాహ సమయంలో తాను వివాహేతర సంబంధం నడిపానని ఆయన తెలిపారు. తద్వారా తన మొదటి భార్యను మోసం చేశానన్నారు.
తన వివాహేతర సంబంధం వల్ల తన మొదటి భార్య కెరిస్టిన్ చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొందన్నారు. తాను సైతం ఇలాంటి పరిస్థితులనే చవిచూశానని డగ్లస్ ఎంహోప్ వెల్లడించారు. దీనికి పూర్తి బాధ్యత తనదేనని తెలిపారు.
తన పిల్లలు (మొదటి భార్య సంతానం) చదివే పాఠశాలలో పనిచేసే ఒక ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం నడిపానని కమల హారిస్ భర్త డగ్లస్ ఎంహోప్ చెప్పారు. దీంతో ఆయన మొదటి భార్య కిరిస్టిన్ ఆయన నుంచి వేరుపడింది.
మొదటి భార్య ద్వారా డగ్లస్ కు ఇద్దరు పిల్లలున్నారు. తన మొదటి భార్య తనకు విడాకులు ఇచ్చాక ఆయన తన రెండో వివాహం కింద కమలా హారిస్ ను పెళ్లి చేసుకున్నారు. కాగా కమలకు ఇది మొదటి వివాహం మాత్రమే. 2014లో వీరి పెళ్లి జరిగింది. కాగా డగ్లస్ వివాహేతర సంబంధం గురించి కమలా హారిస్ కు కూడా తెలుసని ప్రముఖ మీడియా సంస్థ.. సీఎన్‌ఎన్ పేర్కొంది.