పవన్ ముందు భారీ ఆఫర్ పెట్టిన కేఏ పాల్... ఇది పీక్స్!
ఇదే సమయంలో పవన్ ఫ్యాన్స్ అందరూ ప్రజాశాంతి పార్టీలో చేరి సభ్యత్వం తీసుకోవాలని కోరిన కేఏ పాల్... వంద జన్మలు ఎత్తినా ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయరని అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నాడు టీడీపీ నేతలు చేసిన విమర్శలు.. నేడు అధికార వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలూ ఒకెత్తు అయితే... తమ్ముడు తమ్ముడు అంటూ కేఏ పాల్ చేసే విమర్శలూ, చేసే సూచనలూ, ఇచ్చే ఆఫర్లు మరొకెత్తు! ఈ క్రమంలో తాజాగా మరోసారి జనసేన అధినేత పవన్ కు బంపరాఫర్ ప్రకటించారు కేఏ పాల్!
ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ విషయంలో మిగిలిన పార్టీలు ఏ మేరకు పోరాడుతున్నాయి.. ఏమేరకు తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియ జేస్తున్నాయి అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ప్రజాశాంతి పార్టీ చీఫ్ మాత్రం సీరియస్ గానే పోరాడుతున్నారు! వీలైనంత బలంగా తమ నిరసనను కేంద్రానికి తెలియజేయాలని తపిస్తున్నట్లున్నారు.
ఇందులో భాగంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆమరణ న్నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈరోజు ఆ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సమయంలో తగ్గేదేలే అన్నట్లుగా పోలీసులతో కేఏ పాల్ ఘర్షనకు దిగారు. కాగా... స్టీల్ ప్లాంట్ ప్ర్రైవేటీకరణ నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇచ్చారు కేఏ పాల్. అయితే... కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సోమవారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేంద్రం దిగి వచ్చేంత వరకూ దీక్షను కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... జనసేనను ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని సూచించారు. ఇదే సమయంలో పవన్ ఫ్యాన్స్ అందరూ ఫ్యాన్స్ అందరూ ప్రజా శాంతి పార్టీలో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదే సమయంలో పవన్ ఫ్యాన్స్ అందరూ ప్రజాశాంతి పార్టీలో చేరి సభ్యత్వం తీసుకోవాలని కోరిన కేఏ పాల్... వంద జన్మలు ఎత్తినా ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయరని అన్నారు. తనతో కలిసి వస్తే పవన్ ను ఇంటర్నేషనల్ స్టార్ చేస్తానని ఈ సందర్భంగా కేఏ పాల్ ప్రకటించారు.
కాగా... తన అనుచరులతో కలిసి ఆశీల్ మెట్ట సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో కేఏ పాల్ దీక్షకు కూర్చున్న సంగతి తెలిసిందే. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిలిపివేస్తానంటూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్షకు కూర్చున్నారు. అయితే ఈ ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరిన నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు.
ఆయన దీక్షను భగ్నం చేసి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కోసం కేజీహెచ్ కు తరలించారు. ఈ సమయంలో కేఏ పాల్ అరెస్ట్ ను అడ్డుకోవడానికి ఆయన అనుచరులు ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది. ఏది ఏమైనా... దీక్షంతా ఒకెత్తు అయితే... పవన్ కల్యాణ్ కు పాల్ ఇచ్చిన ఆఫర్ మాత్రం ఆన్ లైన్ వేధికగా హైలైట్ గా నిలుస్తోంది.