కేఏ పాల్ మళ్లీ ఏసేశాడు!
ఆయన చేసే వ్యాఖ్యలు, ఇచ్చే హామీలు నమ్మశక్యం కాదు కాబట్టి ఆయన మాటలను అంతా లైట్ తీసుకుంటూ ఉంటారు.
సీరియస్ పాలిటిక్స్ లో ఆటలో అరటి పండు, కమెడియన్ గా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను అందరూ భావిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన చేసే వ్యాఖ్యలు, ఇచ్చే హామీలు నమ్మశక్యం కాదు కాబట్టి ఆయన మాటలను అంతా లైట్ తీసుకుంటూ ఉంటారు.
కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రిని తానేనని, జగన్ తన పార్టీలో చేరితే ప్రధానిని చేస్తానని, పవన్ కల్యాణ్ తన పార్టీలో చేరితే ఏపీ ముఖ్యమంత్రిని చేస్తానని కేఏ పాల్ గతంలో పలుమార్లు చెప్పారు. దేశంలో పార్లమెంటు ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తానని కూడా ఆయన గతంలో ప్రకటించారు. అయితే ఇవేమీ జరగలేదనుకోండి.
అయినా.. కేఏ పాల్ తనపై వచ్చే మీమ్స్, సెటైర్లను పెద్దగా పట్టించుకోరు. యథాలాపంగా తాను చెప్పాలనుకున్నది చెప్పే తీరతారు. ఇప్పుడు కూడా కేఏ పాల్ మరోసారి ఏసేశారు.
తన సలహా వల్లే అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారని కేఏ పాల్ తెలిపారు. జో బైడెన్ వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని తానొక వీడియో చేశానని.. ఆ వీడియో విడుదల అయిన 48 గంటల్లోనే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు జో బైడెన్ ప్రకటించారని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.
తన సలహా మేరకు జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారని తెలిపారు. ఆయన తనను ఎంతో గౌరవిస్తారని వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే బైడెన్ ఆరోగ్యం దెబ్బతింటుందని తాను ఆయనకు చెప్పానన్నారు. దీంతో ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారని తెలిపారు.
కాగా కేఏ పాల్ 2019లో నర్సాపురం లోక్ సభా స్థానం నుంచి బరిలోకి దిగి కేవలం 3 వేల ఓట్లు తెచ్చుకున్నారు. తెలంగాణలోని మునుగోడు శాసనసభ ఉప ఎన్నిక బరిలోనూ దిగి ఓటమి పాలయ్యారు. మొన్నటి ఏపీ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.
దీంతో ఇటీవల కేఏ పాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. క్రియాశీలకంగా లేని 537 పార్టీలను ఎన్నికల సంఘం నుంచి జాబితా నుంచి తొలగించింది. ఆ పార్టీల గుర్తింపును, ఎన్నికల గుర్తులను సైతం రద్దు చేసింది. ఎన్నికల సంఘం తమ జాబితా నుంచి తొలగించిన రాజకీయ పార్టీల జాబితాలో కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీ కూడా ఉండటం గమనార్హం.