పవన్‌పై పాల్.. మళ్లీ ఏసేశాడు!
అందుకే చెప్తున్నా.. తమ్ముడూ పవన్ మన పార్టీ(ప్రజాశాంతి)లోకి వచ్చేయ్.. నిన్నే ఏపీసీఎం అభ్యర్థిగా ప్రకటిస్తా.
తమ్ముడు.. తమ్ముడు.. అంటూనే జనసేన అదినేత పవన్ కళ్యాణ్‌పై ప్రపంచ శాంతి దూత, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనంద పాల్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ``పవన్ పరిస్థితి ఇప్పుడు ఎలాగుందంటే.. తాదూరం కంతలేదు.. మెడలో డోలు అన్నచందంగా ఉంది. అందుకే చెప్తున్నా.. తమ్ముడూ పవన్ మన పార్టీ(ప్రజాశాంతి)లోకి వచ్చేయ్.. నిన్నే ఏపీసీఎం అభ్యర్థిగా ప్రకటిస్తా. ఇంతకుమించిన ఆఫర్ నీకు ఏ పార్టీ కూడా ఇవ్వదు. ఆలోచించుకో. రేపే జాయిన్‌కా. వెంటనే ప్రకటిస్తా`` అని పాల్ వ్యాఖ్యానించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఇప్పటికే ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించామని.. ఆయన తమ పార్టీలోకి వస్తే.. ఏపీకి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన ఏపీలో మీడియాతో మాట్లాడుతూ...‘‘తెలంగాణ నుంచి జన సేనను తరిమేశారు. పవన్ కళ్యాణ్ మాతో పొత్తుకు రావాలి. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లలో చేసిన పాలన ఏమీ లేదు. ప్రత్యేక ప్యాకేజీ, హోదా సాధించలేక పోయారు`` అని వ్యాఖ్యానించారు. అందుకే తాము పవన్‌ను పిలుస్తున్నామని.. మంచి ఆఫర్ కూడా ఇచ్చామని అన్నారు. దీనిని కాపు సోదరులు కూడా అర్ధం చేసుకుంటున్నారని.. కానీ, పవన్ తమ్ముడే అర్థం చేసుకోలేక పోతున్నారని తనదైన శైలిలో అన్నారు.
ఇక, క్రిస్మస్ గురించి మాట్లాడిన పాల్.. ``200 దేశాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు వేల సంవత్సరాల తర్వాత మళ్లీ వస్తానని ఏసు క్రీస్తు చెప్పారు. చాలా మందికి ఇప్పటికీ మేరీ క్రిస్మస్ అంటే ఏమిటో అర్థం తెలియదు. ఏసు క్రీస్తు తర్వాత ఇలాంటి రక్షకుడు పుట్టలేదు. లోకం అంతా స్వార్థం, పాపం పెరిగిపోయింది. క్రిస్మస్ సందర్భంగా నిరాశ్రయులకు, ఆహారం దుప్పట్లు పంపిణీ చేశాం’’ అని కేఏ పాల్ తెలిపారు.