పాటతో వచ్చిన కేఏ పాల్
టీవీ ఛానళ్లు రీచ్ కోసం కేఎ పాల్ వార్తలను ప్రచారం చేస్తే .. యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియాకు ఇతను ఒక కామెడీ కింగ్ లా తయారయ్యాడు
కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని ఏ ముహూర్తానా పెట్టాడో ? ఎందుకు పెట్టాడో ? తెలియదు గానీ తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడ సాధారణ, ఉప ఎన్నికలు వచ్చినా అక్కడ వాలిపోతున్నాడు. టీవీ ఛానళ్లు రీచ్ కోసం కేఎ పాల్ వార్తలను ప్రచారం చేస్తే .. యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియాకు ఇతను ఒక కామెడీ కింగ్ లా తయారయ్యాడు. అయితే అసలు ఏ ఓటుబ్యాంకూ లేని షర్మిలకు అక్కడ తెలంగాణలో, ఇక్కడ ఆంధ్రాలో లైవ్ కవరేజ్ లు ఇస్తున్నారని, తనకు మాత్రం ప్రచారం కల్పించడం లేదని ఇటీవల పాల్ మండిపడ్డాడు. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వకుంటే జగన్ మాజీ సీఎం అవుతాడని, నేను శపిస్తే అందరూ సర్వనాశనం అవుతారని హెచ్చరించాడు.
ఆంధ్రాలో ఎన్నికల నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేఎ పాల్ ఒక పాటను విడుదల చేశాడు. ‘‘అన్నా అన్నా అన్నా కేఎ పాలన్నా.. తుప్పు సైకిల్ మాకొద్దన్నా .. పగిలే గ్లాసులు మాక్కొద్దన్నా .. వాడే పూవులు మాకొద్దన్నా ..తిరగని ఫ్యానులు మాకొద్దన్నా’’ అంటూ సాగిన ఈ పాట ప్రజాశాంతి పార్టీ గుర్తు మట్టి కుండను గుర్తు చేస్తూ ‘‘మలినం లేని మట్టి కుండలా .. చల్లనైన నీళ్ల కుండలా ... స్వచ్చమైన గోమాత పాలలా .. పాలన్నే మాక్కావాలన్నా’’ అంటూ సాగింది. కేఎ పాల్ వివిధ దేశాధినేతలు, ప్రముఖులను కలిసి ఫోటోల బ్యాక్ గ్రౌండ్ లో ఈ పాటను ఫీడ్ చేశారు.
తెలంగాణలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలలో కేఎ పాల్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ ఎన్నికల్లో స్వయంగా బరిలోకి దిగిన పాల్ కేవలం 805 ఓట్లను మాత్రమే సాధించగలిగాడు. ప్రస్తుతం ఆంధ్రాలో శాసనసభ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అక్కడ హడావిడి చేస్తున్నాడు. ఒకప్పుడు ప్రపంచంలోని పలు దేశాల అధినేతలను శాసించిన పాల్ ప్రస్తుతం కామెడీ స్టార్ గా మిగిలిపోవడం విధి రాత అనే చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విశాఖ లోక్ స్థానం నుండి ఎంపీగా, గాజువాక శాసనసభ స్థానం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కేఎ పాల్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నాడు. అంతే కాకుండా తమ పార్టీ నుండి పోటీ చేసేందుకు 3 వేల మంది ధరఖాస్తు చేసుకున్నారని, అర్హులను ఎంపిక చేసి పోటీకి దింపుతామని పాల్ చెబుతుండడం విశేషం.