త్వరలో కాపుల మీటింగ్...రాజకీయ సంచలనాలేనా...!?
అందుకే ఈసారి ఎలాగైనా రాజ్యాధికారం సాధించాలన్నది కాపుల పట్టుదలగా ఉంది.
ఏపీలో కాపుల ఫ్యాక్టర్ ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులు అతి ముఖ్య పాత్ర పోషించడం ఖాయమని కూడా అంటున్నారు. కాపులు 2024 ఎన్నికలను ఒక చాలెంజ్ గా తీసుకుంటున్నారు. ఈసారి తప్పితే మళ్లీ రాదు అన్నట్లుగా కాపులలో ఒక రకమైన భావన ఉంది. అందుకే ఈసారి ఎలాగైనా రాజ్యాధికారం సాధించాలన్నది కాపుల పట్టుదలగా ఉంది.
ఇదే సమయంలో కాపులు తొందరలో సమావేశం అయి కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు అని అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా వాడుకోవాలని కూడా డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో కాపులు తొందరలో సమావేశం అయి రాజ్యాధికారం తమకు తప్పనిసరిగా కావాలని కోరుతారు అని అంటున్నారు.
ఏపీలో చూస్తే అధికార వైసీపీ ఉంది. ఆ పార్టీకి ఎటూ ప్రజా వ్యతిరేకత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి బలం సరిపోగా జనసేనతో పొత్తు పెట్టుకుంది అని అంటున్నారు. పొత్తులతో వెళ్తేనే ఓట్ల చీలిక ఉండదని అపుడు సులువుగా వైసీపీని ఓడించవచ్చు అన్నది టీడీపీ ప్లాన్.
అయితే టీడీపీ పొత్తు ఎత్తుగడలను తమకు ఫేవర్ గా మార్చుకోవడం మీదనే కాపు పెద్దలు దృష్టి పెట్టారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో టీడీపీ పొత్తుని ఇందుకు వాడుకోవాలని చూస్తున్నారు. దాంతో కాపుల నుంచి ఒక డిమాండ్ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 50 కి తగ్గకుండా కాపులకు సీట్లు పొత్తులో భాగంగా టీడీపీ ఇవ్వాలని డిమాండ్ పెట్టబోతున్నారు అని అంటున్నారు.
అదే విధంగా సీఎం పదవి షేరింగ్ విషయంలో కూడా స్పష్టత ఉండాలని అంటున్నారు. అంటే జనసేనకు చాన్స్ ఇవ్వాల్సిందే అన్నది కాపు పెద్దల మాటగా ఉంది. ఇప్పటికే ఈ రకమైన అభిప్రాయాన్ని కాపు నేత, మాజీ మంత్రి హరి రామజోగయ్య లేఖల రూపంలో బాహాటంగానే వ్యక్తం చేశారు.
ఎన్నికల వేళ కీలక సమయంలో జరిగే కాపుల మీటింగ్ లో ఇలాంటి రాజకీయ సంచలనాలు ఎన్నో ఉంటాయని అంటున్నారు. ఈ మీటింగ్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిస్తారని, ఆయనకు కాపులు తమ డిమాండ్లు అన్నీ వివరిస్తారని అంటున్నారు.
ఇక ఏపీలో రాజకీయ వాతావరణం చూస్తే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అని జనసేన ఉంది. టీడీపీ ఆలోచన కూడా అదే. అయితే కాపుల ఓట్లు ఇపుడు చాలా కీలకం కాబోతున్నాయి. ఈ నేపధ్యంలో కాపుల ఓట్లను కనుక ఒడిసిపట్టుకున్న వారే విజేత అవుతారు. కాపుల డిమాండ్ మాత్రం ఈ సమయంలో ఆలోచించాల్సిందే అంటున్నారు. మరి దీనికి టీడీపీ అంగీకరిస్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంది.
జనసేన టీడీపీ పొత్తు అన్నది రాజకీయ పొత్తు. అది సామాజిక పొత్తుగా మారాలీ అంటే కనుక కచ్చితంగా కాపుల డిమాండ్లు నెరవేర్చాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కాపుల మీటింగ్ వేదిక డేట్ ఫిక్స్ అవలేదు కానీ రాజకీయంగా మాత్రం ప్రకంపనలు పుట్టించే మీటింగ్ ఇది అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.