‘ఆపరేషన్‌ పిఠాపురం’ మొదలెట్టేసిన కాపు నేత!

ఇక్కడి నుంచి స్వయంగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తుండటంతో ఆయనను చిత్తుగా ఓడించాలని కాపు నేతలకు పిలుపునిచ్చారు.

Update: 2024-03-25 17:23 GMT

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ను పిఠాపురంలో చిత్తుగా ఓడిస్తానని ప్రకటించిన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ‘ఆపరేషన్‌ పిఠాపురం’ మొదలుపెట్టేశారు. పిఠాపురం మండలంతోపాటు ఆ నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలానికి చెందిన కాపు నేతలను తన స్వగ్రామం కిర్లంపూడికి ఆహ్వానించారు. వారితో పిఠాపురం నియోజకవర్గ పరిస్థితులపై కూలంకషంగా చర్చించారని తెలుస్తోంది. ఇక్కడి నుంచి స్వయంగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తుండటంతో ఆయనను చిత్తుగా ఓడించాలని కాపు నేతలకు పిలుపునిచ్చారు.

కేవలం పిఠాపురం నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలామంది కాపు నేతలకు ముద్రగడ పద్మనాభం నుంచి ఫోన్లు వెళ్లినట్టు చెబుతున్నారు. కిర్లంపూడిలో తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారని అంటున్నారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఉన్న ముద్రగడకు ఉభయగోదావరి జిల్లాల్లో విస్తృత పరిచయాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే కాపు రిజర్వేషన్‌ ఉద్యమ సమయంలోనూ చాలా మందితో సన్నిహిత సంబంధాలు నెరిపారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని ఓడించాలని కంకణం కట్టుకున్న ముద్రగడ పద్మనాభం ఈ మేరకు తన ఆపరేషన్‌ కు శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన కూటమికి ఒక్క సీటు కూడా రాకూడదని ఆయన కాపు నేతలకు పిలుపునిచ్చినట్టు చెబుతున్నారు.

తాను కాపు ఉద్యమం చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తనను అన్ని విధాలుగా అణిచివేస్తే ఆయన పక్కనే ఉన్న పవన్‌ వేడుక చూశారని ఈ సందర్భంగా ముద్రగడ నిప్పులు చెరిగారు.

కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేయడం వల్లే తాను ఉద్యమం లేవనెత్తాల్సి వచ్చిందని ముద్రగడ తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉండటం వల్లే తాను ఆనాడు రోడ్డెక్కాల్సి వచ్చిందని వెల్లడించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు కాపు ఉద్యమ కారులను కొట్టించినా, పోలీసులతో కేసులు పెట్టి వేధించినా ఆయన పక్కనే ఉన్న పవన్‌ కళ్యాణ్‌ పట్టించుకోలేదని ముద్రగడ ఆరోపించారు. చంద్రబాబు పక్కనే ఉన్న పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఉపకారం అంతా ఇంతా కాదని వెటకారం చేశారు. పిఠాపురం ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోతారని పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించడం సరికాదన్నారు.

కాగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్‌ పార్టీ గాలి బలంగా వీచి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన 2009లో ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగి ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో నాటి అధికార పార్టీ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన ముద్రగడ ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన వంగా గీత పిఠాపురం నుంచి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ ను పిఠాపురంలో ఓడిస్తానంటున్న ముద్రగడ ఈసారైనా సక్సెస్‌ అవుతారో, లేదో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News