కరాచీలో పెరిగిన యాచకుల సంఖ్య.. పరిస్థితి ఎలా ఉందంటే...?
దేశ ప్రధాని సైతం ప్రత్యేక విమానంలో ప్రయాణించలేని పరిస్థితికి చేరుకుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరో సమస్య ఇప్పుడు పీక్స్ కి చేరింది
పాకిస్థాన్ ని సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి. నిన్నమొన్నటివరకూ ఎగురుతూ మిడిసిపడినట్లు కనిపించిన పాకిస్థాన్, భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడే ప్రయత్నాలు చేసిన పాకిస్థాన్ ను ఇప్పుడు ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి. దేశ ప్రధాని సైతం ప్రత్యేక విమానంలో ప్రయాణించలేని పరిస్థితికి చేరుకుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరో సమస్య ఇప్పుడు పీక్స్ కి చేరింది.
అవును... పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకీ అధ్వాన్నంగా తయారవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, పలు సంస్థల నుండి తీసుకున్న అప్పులతో కాలం గడుపుతోన్న పరిస్థితి. ఈ సమయంలో... రంజాన్ మాసం వచ్చింది. దీంతో... పాకిస్తాన్ లోని కరాచీ నగరం బిచ్చగాళ్ల రాజధానిగా మారిందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!
ఇందులో భాగంగా... దేశం నలుమూలల నుంచి సుమారు నాలుగు లక్షలకు పైగా యాచకులు కరాచీ చేరుకున్నారని.. దీంతో, నగరంలో నేరాల సంఖ్య చాలా పెరిగిందని అంటున్నారు. దీంతో... ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. ప్రస్తుతం కరాచీలోని ప్రతి జంక్షన్ వద్దా భారీ సంఖ్యలో యాచకులు దర్శనమిస్తున్నారని.. దీనికితోడు నగరంలో నేర సంఘటనలు ఇటీవల కాలంలో మరింతగా పెరిగాయని పోలీసు అధికారులు చెబుతున్నారని తెలుస్తుంది.
ఈ వ్యవహారంపై పాకిస్థాన్ కు చెందిన జియో న్యూస్ ఛానల్ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో భాగంగా... ఈద్, రంజాన్ సమయంలో పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల నుంచి యాచకులు కరాచీకి వచ్చారని, వారి సంఖ్య సుమారు నాలుగు లక్షల వరకు ఉండవచ్చని కరాచీ పోలీస్ ఆఫీసర్ ఇమ్రాన్ యాకూబ్ మిన్హాస్ చెప్పారని తెలుస్తోంది.
ఇదే క్రమంలో... సిటీ అడిషనల్ ఇనిస్పెక్టర్ జనరల్ మాట్లాడుతూ పాత పద్ధతుల్లో నేరస్తులను పట్టుకోవడం కష్టసాధ్యమని, అందుకే ప్రతి కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. ఇదే సమయంలో... ఇటీవలి కాలంలో నగరంలో చోటుచేసుకున్న పలు నేరాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించినట్లు తెలుస్తోంది!