ఈ సీనియర్‌ నేతను చంద్రబాబు కరుణిస్తారా?

2019 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-14 06:49 GMT

2019 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇందులో నలుగురు ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. వీరిలో ఒకరు కరణం బలరామకృష్ణమూర్తి (కరణం బలరాం). 40 ఏళ్ల రాజకీయ నేపథ్యం ఉన్న ఈయన పలుమార్లు అద్దంకి, చీరాల, మార్టూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి 1999లో ఒంగోలు టీడీపీ ఎంపీగానూ విజయం సాధించారు. కొన్నాళ్లు కాంగ్రెస్‌ పార్టీలో, మరికొన్నాళ్లు టీడీపీలోనూ కొనసాగారు.

కాగా 2019లో చీరాల నుంచి టీడీపీ తరపున గెలిచిన కరణం బలరాం.. 2024లో తనకు బదులుగా తన కుమారుడు కరణం వెంకటేశ్‌ కు వైసీపీ టికెట్‌ ఇప్పించుకున్నారు. అయితే తన కుమారుడిని గెలిపించుకోలేకపోయారు. కూటమి హవాలో కరణం Ðð ంకటేశ్‌ ఘోరంగా ఓడారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు కరణం బలరాం టీడీపీలోకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ద్వారా టీడీపీలో రాకకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. అయితే కష్టకాలంలో పార్టీ మారిన కరణం బలరాంను చేర్చుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరని అంటున్నారు. వైసీపీ నుంచి వచ్చే ఏ నేతనూ చేర్చుకోవద్దని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

వైసీపీ నుంచి వచ్చే నేతలను చేర్చుకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. అందులోనూ ప్రతి ఎన్నికల్లోనూ ఇలా పార్టీలు మారే అయారాంలు, గయారాంలను ప్రోత్సహించకూడదని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం చీరాల టీడీపీ ఎమ్మెల్యేగా కొండయ్య యాదవ్‌ ఉన్నారు. ఈ క్రమంలో కరణం బలరాంను పార్టీలో చేర్చుకుంటే నియోజకవర్గంలో ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు తప్పదని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా పొత్తుల్లో భాగంగా ఇటీవల ఎన్నికల్లో చాలామందికి చంద్రబాబు టికెట్లు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు వారందరికీ న్యాయం చేయాల్సి ఉంది. నామినేటెడ్‌ పదవులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యత్వాలు తదితరాల రూపంలో పదవులు ఇవ్వాల్సి ఉంది.

ఈ పదవులను జనసేన, బీజేపీ నేతలు సైతం ఆశిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా వైసీపీ నుంచి నేతలను పార్టీలో చేర్చుకుని వారికి పదవులు ఇచ్చే ఉద్దేశంలో చంద్రబాబు లేరని అంటున్నారు.

అయితే కరణం బలరాం తన ఆశలు కోల్పోకుండా ఒక మీడియా అధినేత ద్వారా టీడీపీలోకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. ఆ మీడియా అధినేత ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అనుకూల చానల్‌ గా ముద్రపడ్డ ఆ మీడియా అధినేత చెప్పినమాటకు చంద్రబాబు అంగీకరిస్తారో, లేదో మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోనుంది.

Tags:    

Similar News