కారు పార్కింగ్ కోసం.. సీఎం కు షాకిచ్చిన సీనియర్ సిటిజన్!
ఈ ప్రాంతం లో మాకు కారు పార్కింగ్ కోసం స్థలం దొరకడంలేదు అని చెప్పాడు.
రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అవ్వొచ్చు.. తన కు ఇబ్బంది వచ్చినప్పుడు ఆపి అడగడం లో తప్పేముందని భావించాడు ఓ పెద్దాయన. ఆయనవల్ల, ఆయనన్ని చూడటానికి వచ్చే వారివల్ల తనకు ఇబ్బంది కలుగుతుందని నేరుగా సీఎంకే ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన కర్ణాటక లో జరిగింది. సీఎం సిద్ధరామయ్యకు ఎదురైంది.
అవును... మెట్రో నగరాల్లో కారు పార్కింగ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రద్దీగా ఉండే రోడ్లు, రోడ్లకు ఇరువైపులా ఇళ్లు ఉండటంతో కార్ పార్కింగ్ అనేది నరకంగా అనిపిస్తుంటుంది. ఇక సీఎం లాంటి వ్యక్తి ఉండే ప్రాంతం లో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కొన్న ఒక పెద్దాయన సీఎం కు షాకిచ్చారు.
వివరాళ్లోకి వెళ్తే... బెంగళూరు లో సీఎం సిద్ధరామయ్య ఇంటికి ఎదురుగా నరోత్తమ్ అనే వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. శుక్రవారం సీఎం ఇంటి నుంచి వస్తున్న సమయం లో ఆయన కాన్వాయ్ ను అతడు అడ్డుకున్నాడు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఏమిటి విషయం అని ఆరాతీశారు. తాను సీఎం తో మాట్లాడాల ని పెద్దాయన సూటిగా చెప్పాడు.
ఆయన అభ్యర్థన కు అధికారులు అనుమతి ఇవ్వడంతో నేరుగా సీఎం కారు వద్దకు వెళ్లారు. మిమ్మల్ని చూసేందుకు వచ్చేవారి వాహనాలతో తమకు ఇబ్బందిగా ఉందని నేరుగా పాయింట్ కు వచ్చేశాడు. ఈ ప్రాంతం లో మాకు కారు పార్కింగ్ కోసం స్థలం దొరకడంలేదు అని చెప్పాడు.
మిమ్మల్ని చూడటానికి వచ్చే వారి వాహనాలు ఇష్టం వచ్చినట్లు పార్క్ చేయడం వల్ల.. తాను, తన కుటుంబసభ్యులు కార్లను బయటికి తీయలేకపోతున్నాం అని క్లియర్ గా చెప్పేశాడు. గత ఐదేళ్లుగా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నామని సూటిగా సుత్తిలేకుండా కుండబద్దలు కొట్టాడు.
దీంతో పరిస్థితి అర్ధం చేసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య... అధికారుల ను వెంటనే పిలిచారు. ఇకపై పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల ని ఆదేశించారు. దీంతో థాంక్స్ చెప్పిన పెద్దయన అక్కడనుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
కాగా... తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా ఎన్నికైన సిద్ధరామయ్య.. తన అధికారిక నివాసానికి మారలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నివాసం ఉన్న ఇంటి లోనే ఇప్పటికీ ఉంటున్నారు. అయితే దీనికి మాజీ ముఖ్యమంత్రే కారణం అని తెలుస్తోంది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప.. సీఎం అధికారిక బంగ్లాను ఇంకా ఖాళీ చేయలేదంట. దానివల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు చెబుతున్నారు. అయితే... యడియూరప్ప త్వరలోనే అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తారని, ఆగస్టు నెల లో సిద్ధరామయ్య అందులోకి మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారంట.