ఏపీ బార్డర్ లో వేల మందికి లిక్కర్ పార్టీ... వీడియో వైరల్!
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఓ నేత.. తన విజయానికి సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలపాలనుకున్నారంట
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఓ నేత.. తన విజయానికి సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలపాలనుకున్నారంట. ఈ నేపథ్యంలో నగర శివార్లలో ఈ మేరకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా ప్రజలకు మద్యం, మాంసాహార భోజనం పంపిణీ చేశారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చకు కారణం అయ్యింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది!
అవును... తనను ఎంపీగా గెలిపించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలపాలని భావించిన ఓ ఎంపీ.. భారీ కార్యక్రమాన్నే ఏర్పాటు చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఊహించినదానికంటే ఎక్కువగా భారీగా తరలివచ్చిన ప్రజలకు ఉచితంగా బీరు, హార్డ్ లిక్కర్, మాంసాహార భోజనం ఏర్పాటు చేశారని అంటున్నారు. దీంతో... ఈ కార్యక్రమంపై పోలీసులు స్పందించారు. ఎక్సైజ్ శాఖకు సూచనలు చేస్తున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి, కర్ణాటక మాజీమంత్రి డాక్టర్ కే సుధాకర్ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన బీజేపీ - జేడీఎస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలపాలని భావించారంట! దీంతో... బెంగళూరు సిటీ అవుట్ కట్స్ లోని నెలమంగళలో ఈ మేరకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలకు ఉచిత మద్యం, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అందించే కార్యక్రమం చేపట్టారంట. వాస్తవానికి ఈ కార్యక్రమానికి 10,000 మంది హాజరవుతారని భావించి ఏర్పాట్లు చేస్తే... యాభై వేల మంది హాజరయ్యారంట. దీంతో... ప్రజలు మద్యం, బిర్యానీల కోసం కేకలు వేయడంతో గందరగోళంగా మారిందని చెబుతున్నారు.
స్థానిక బీజేపీ అధ్యక్షుడు స్పాన్సర్ చేసినట్లు చెబుతున్న ఈ కార్యక్రమానికి పోలీసులు హాజరై... బీజేపీ – జేడీఎస్ కార్యకర్తలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదని చెబుతున్నారు. ఊహించని రీతిలో భారీ ఎత్తున ప్రజలు హాజరు కావడంతో ఆ జనాన్ని నియంత్రించడం అసాధ్యంగా మారిందని పోలీసులు వాపోతున్నారని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన పోలీస్ అధికారి... ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చిందని.. ఇందులో పోలీసుల తప్పేమీ లేదని.. లిక్కర్ పార్టీలకు అనుమతి ఇచ్చే బాధ్యత ఎక్సైజ్ శాఖపై ఉందని చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఎక్సైజ్ అధికారులు... ఈ కార్యక్రమం నిర్వహణ కోసం నిర్వాహకులు తమ శాఖకు రూ.11,500 రుసుము చెల్లించారని.. ఆ తర్వాత ఒక రోజు అనుమతి జారీ చేశామని చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది!
అనంతరం ఈ విషయంపై స్పందించిన ఎంపీ డాక్టర్ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ... ఈ ఘటన గురించి తనకు ఏమీ తెలియదని అన్నారు. మీడియాలో వచ్చిన తర్వాతే తనకు తెలిసిందని.. ఇది కార్యకర్తలు ప్లాన్ చేసుకున్న పార్టీ అని తెలిపారు! ఇదే సమయంలో 20 ఏళ్ల రాజకీయాల్లో మా సొంత కార్యకర్తలకు మంద్యం పంపినంత మాత్రాన్న తప్పేమీ కాదని.. గతంలో కాంగ్రెస్ నేతలూ పంచారని చెప్పినట్లు తెలుస్తుంది!