కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ : బీఆర్ఎస్ ఆంధ్రా వాదం !
తెలంగాణా సాధించాక అధికారం చేపట్టాక కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో అన్న మాటలు ఏంటి అన్నది ఇపుడు అంతా చర్చించుకుంటున్నారు.
బీఆర్ఎస్ ప్రాంతీయ వాదాన్ని పీక్స్ కి చేర్చి ఆ పునాదుల మీద్ ఎదిగింది అన్నది తెలిసిందే. తెలంగాణ సెంటిమెంట్ తో ఆ పార్టీ ఒక వైపు ఉద్యమాన్ని రాజేసింది. మరో వైపు పార్టీని కూడా స్ట్రాంగ్ గా నిర్మించుకుంది. తెలంగాణా సాధించాక అధికారం చేపట్టాక కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో అన్న మాటలు ఏంటి అన్నది ఇపుడు అంతా చర్చించుకుంటున్నారు.
తెలంగాణలో ఉన్న వారు అంతా తెలంగాణ వారు అని కేసీఆర్ ఆనాడు బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇన్నాళ్ళ తరువాత మళ్లీ ఆంధ్రా వాదం ఆ పార్టీలో మొలకెత్తుతోంది. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రెడ్డి వర్సెస్ ఆరికపూడి గాంధీ గా సాగిన రాజకీయ రగడ కాస్తా ప్రాంతీయ వాదాన్ని మరోసారి తెర మీదకు తెచ్చిందా అని చర్చించుకుంటున్నారు.
నిజానికి చూస్తే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఇది పొలిటికల్ వార్. ఆ వార్ లో డైలాగులు పేలి చివరికి అవి కాస్తా దాడుల దాకా వెళ్లాయి. ఈ సవాళ్లు ప్రతి సవాళ్ళలో అది అలాగే సాగాలి కానీ కౌశిక్ రెడ్డి మాత్రం మధ్యలోకి ఆంధ్రా వాదాన్ని తెచ్చారు. ఎక్కడ నుంచో గాంధీ బతకడానికి తెలంగాణాకు వచ్చి తెలంగాణా వారి మీదనే దాడి చేస్తారా అని భారీ డైలాగులే పేల్చారు.
గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడాన్ని ఎవరూ ఒప్పుకోరు. కానీ దానికీ ప్రాంతీయ వాదానికి సంబంధం ఏంటి అన్నది చర్చగా ఉంది. ఇంతకీ ఆరికపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే ఎమ్మెల్యేగా పనిచేశారు. అపుడు ఆయన ఆంధ్రుడని గుర్తు రాలేదా అని అంటున్నారు.
ఇపుడు ఆయన బీఆర్ఎస్ తో విభేదించి ఉన్నారు. పైగా కాంగ్రెస్ తో కలసి ఉంటున్నారు కాబట్టి అయన మీద ఈ రకంగా కొత్త ముద్ర వేస్తున్నారా అని అంటున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు అయింది. హైదరాబాద్ సహా తెలంగాణాలో కేవలం ఆంధ్రులే కాదు అనేక రాష్ట్రాల వారు ఉంటున్నారు. అయినా సరే సందర్భం వచ్చిన ప్రతీ సారీ ఈ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టడం తగునా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
అదే సమయంలో కౌశిక్ రెడ్డి ఇంటి మీద అరికపూడి గాంధీ దాడి చేశారు అని బీఆర్ఎస్ మొత్తం ఆయనకు మద్దతుగా నిలుస్తోంది. మరి ఆయన ఎక్కడ నుంచో వచ్చాడు అంటూ గాంధీ మీద చేసిన కామెంట్స్ మీద ఏమంటారు అని కూడా అంటున్నారు. కేసీఆర్ ఈ వ్యాఖ్యలను తన ఎమ్మెల్యే నుంచి సహిస్తారా అని కూడా అంటున్నారు
తాను నిఖార్సు అయిన తెలంగాణావాడిని అంటున్నారు. తన ఇంటి మీద జరిగిన దాడిని తెలంగాణా మీద దాడిగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఈ ఇద్దరు మధ్య పొలిటికల్ వార్ కి మధ్యలో ఆంధ్రా తెలంగాణాలకు సంబంధం ఏమిటి అని కూడా అంతా అంటున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచిన గాంధీని పట్టుకుని నాన్ లోకల్ అని అంటున్నారు. ఇది సమంజసమా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
అసలైన తెలంగాణావాదులు కొసరు తెలంగాణావాదులు ఉంటారా అని కూడా అంటున్నారు. నిజానికి బీఆర్ఎస్ కి తెలంగాణా సెంటిమెంటే అసలైన ఆయుధం. ఇపుడు దాన్ని కౌశిక్ రెడ్డి టచ్ చేశారు. మరి దీనినే బీఆర్ఎస్ కూడా పట్టుకుంటుందా లేక దాన్ని లైట్ తీసుకుంటుందా అనంది చూడాలి. ఏది ఏమైనా రాజకీయాల్లోకి కులం, మతం, ప్రాంతం వంటి సున్నిత అంశాలు తేవడం వద్దు అనే అంతా అంటున్నారు.