మరోసారి గళం విప్పాడు.. అడ్డంగా బుక్ అయి.. వెనక్కి తీసుకున్నాడు
క్రికెట్ లో చూస్తుంటాం. తెలివిగా ఆడటం వేరు. దానికి దూకుడు యాడ్ కావటం వేరు.
క్రికెట్ లో చూస్తుంటాం. తెలివిగా ఆడటం వేరు. దానికి దూకుడు యాడ్ కావటం వేరు. అందుకు భిన్నంగా తెలివి లాంటివేమీ లేకుండా దూకుడుగా ఆడటమే లెక్కగా పెట్టుకునే క్రికెటర్ తో జట్టుకు ఎలాంటి లాభం ఉండదు. ఆ మాటకు వస్తే సదరు ఆటగాడు జట్టుకు వరంగా కాక భారంగా మారుతుంటాడు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు అలానే ఉందంటున్నారు. నోరు తెరిస్తే చాలు.. సమయస్ఫూర్తి లేని ఆవేశాన్ని ప్రదర్శిస్తుంటారన్న అపప్రదను మూటకట్టుకున్నారు.
ఇప్పటికే పలుమార్లు అడ్డంగా బుక్ అయిన కౌశిక్ రెడ్డి.. తాజాగా మరోసారి బుక్ అయ్యారు. రేవంత్ సర్కారు ప్రవేశ పెట్టిన మహలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు స్కీంపై ఆయన గళం విప్పారు. ఇప్పటికే ఈ అంశంపై మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ కు ఎలాంటి మైలేజీ రాకపోగా.. నెగిటివ్ మార్కుల్ని మూటకట్టుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటో డ్రౌవర్ల ఉపాధికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా మాట్లాడిన మాటలకు.. ఆటోలు ఎక్కే ఏ ఒక్కరు ఒప్పుకోకపోవటమే కాదు.. ఆటోలు ఎక్కే అలవాటు ఉండి ఉంటే కేటీఆర్ నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావన్న సెటైర్లు పడుతుంటాయి.
అయినప్పటికీ తగ్గకుండా అదే పనిగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే పథకాన్ని విమర్శిస్తూ ఉండటం తెలిసిందే. తాజాగా ఇదే అంశాన్ని అసెంబ్లీలో టేకప్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్కకు.. కౌశిక్ రెడ్డికి వాగ్యుద్దం జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన కౌశిక్ రెడ్డి.. ‘‘మంత్రి సీతక్కకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు.. ఆర్టీసీ కార్మికులకు ఏం చేసిందో నాలెడ్జ్ లేకపోవచ్చు’’ అంటూ మాట విసిరారు. అక్కడితో ఆగని ఆయన.. ‘‘మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో ఇబ్బందులు వస్తున్నాయి. బస్సుల సంఖ్య పెంచాలి. ఆటో డ్రైవర్ల సంక్షేమంపై ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్.. తాజా బడ్జెట్ తో డబ్బులు కేటాయించలేదు’’ అంటూ వ్యాఖ్యానించాయి.
దీనిపై తెలంగాణ అధికారపక్షం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మహిళా మంత్రిని ఉద్దేశించి.. నాలెడ్జ్ లేదన్న వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై సీతక్కకు క్షమాపణలు చెప్పాలని లేదంటే ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇదే సమయంలో మంత్రి సీతక్క స్పందిస్తూ.. ‘‘బీఆర్ఎస్ నేతలు ఒకవైపు బస్సులు పెంచాలంటూనే.. మరోవైపు ఆటో డ్రైవర్లపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఆటోడ్రైవర్లను రచ్చగొట్టేలా రాజకీయం చేయొద్దు. కౌశిక్ రెడ్డిలా నాకు దురాలోచనలు.. దురహంకారమైన నాలెడ్జ్ లేదు’’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
మహిళా మంత్రిని ఉద్దేశించి నాలెడ్జ్ లేదన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యపై దుమారం రేగింది. దీనిపై అసెంబ్లీ స్పీకర్ సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో.. మరో దారి లేని కౌశిక్ రెడ్డి.. మంత్రి సీతక్కపై తాను మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఆవేశంతో మాట్లాడటం.. అంతలోనే సారీ చెప్పేయటం ద్వారా మైలేజీ సంగతి తర్వాత పార్టీకి డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని కౌశిక్ రెడ్డి ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.