'కావడి' రాజకీయం... దేశవ్యాప్త కలకలం.. అసలేంటి?!!
దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లోని వారు ఎంతో ఘనంగా నిర్వహించుకునే 'కావడి' ఉత్స వాలు నేడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి.
కావడి లేదా కన్వర్ యాత్రల గురించి తెలుసు కానీ.. కావడి రాజకీయం గురించి తెలియకపోవచ్చు. అయితే.. ఈ దేశంలో ఏదైనా సాధ్యమే. ఏవిషయాన్నయినా.. తమకు అనుకూలంగా మార్చుకోవడంలో రాజకీయ నేతలు సిద్ధహస్తులు. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లోని వారు ఎంతో ఘనంగా నిర్వహించుకునే 'కావడి' ఉత్స వాలు నేడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు.. కావడి ఉత్సవం సాగేప్రధాన రహదారుల్లోని హోటళ్ల ముందు.. 'యజమాని పేరు, కులం, మతం వంటి వివరాలను పేర్కొనాలని' హుకుం జారీ చేయడం కలకలం రేపింది.
దీంతో అసలు ఇదేంటి? అనే చర్చ జోరుగా సాగుతోంది. దీనిలో సుప్రీంకోర్టు కూడా ఎంటరైంది. ఫలితంగా ప్రస్తుతం చెలరేగిన భారీ రాజకీయాలకు కొంత 'కామా' అయితే పడింది. కానీ, వివాదం మాత్రం అలానే ఉండిపోయింది.
అసలేంటీ కావడి యాత్ర!
శ్రావణమాసంలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన శివభక్తులు.. తమ తమ ఊళ్లలోని శివాలయాల్లో గంగా జలంతో మహాదేవునికి అభిషేకం చేస్తారు. అలానే.. శివాలయాలను కూడా పవిత్ర గంగా జలంతో తడుపుతారు. దీనికి పురాణ ఇతిహాసం ఉంది. శ్రావణ మాసంలోనే జరిగిన క్షీరసాగర మథనంలో తొలుత పుట్టింది.. గరళం! తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించింది.(అందుకే శ్రావణ మాసంలో వరలక్ష్మీవ్రతం చేస్తారు). గరళాన్ని మహాశివుడు పుచ్చుకుని గత కంఠంలో బంధించాడు.
అయితే.. గరళం ఆయనకు ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు అభిషేకాలు చేస్తుండడం తెలిసిందే. ఇలా.. గరళం జనియించిన సందర్భం.. శివుడు దానిని పుచ్చుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆలయాల్లో ఆరోజు విశేష అభిషేకాలు చేస్తారు. ఇక, ఉత్తరాదిలో మాత్రం... మరో సంప్రదాయాన్ని అనుస రిస్తారు. అంటే.. శివలింగంతోపాటు ఆలయాలను కూడా పూర్తిగా గంగాజలంతో తడిపేస్తారు.
దీనికి గాను.. తమ తమ ప్రాంతాల నుంచి శివ భక్తులు.. పెద్ద పెద్ద కావిడులు భుజాన వేసుకుని ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా.. ఇతర ప్రాంతాల్లోని గంగా నది వద్దకు వచ్చి.. ఆ జలాలను భుజాలపై మోసు కుని వెళ్తారు. దీనిని అత్యంత పవిత్రంగా నిర్వహిస్తారు. మేళతాళాలు, హరహర మహాదేవ నినాదాలు, భోలే బాబా(శివుడు) భజన సహా కోలాట బృందాలుగా.. కావడులు మోసుకు వచ్చి.. గంగా జలాలను తీసుకువెళ్తారు. ఇది వారం రోజులు జరిగే యాత్ర. ఉత్తరాదిలో దీనిని అత్యంత పవిత్రంగా భావిస్తారు.
వివాదం ఏంటి?
వివాదం విషయానికి వస్తే.. కావడి యాత్ర సాగే ప్రధాన రహదారులు లేదా.. ఆయా ప్రాంతాల్లో ఉన్న అన్ని హోటళ్ల యజమానుల పేర్లు, వారి కులం, వారి మతం.. ఇత్యాది వివరాలను పెద్ద పెద్ద బోర్డులతో ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం తొలుత ఆదేశించింది. తర్వాత..ఉత్తరాఖండ్ కూడా అందిపుచ్చుకుంది. తలచిన మరుక్షణమే.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చేశాయి. అయితే.. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది.
1) హోటల్ యజమానుల పేర్లు ఎందుకు? 2) వారి కులంతో పనేంటి? 3) హిందూ ముస్లింల మధ్య వివాదాలు సృష్టించేందుకేనా? .. అనే పెద్ద పెను వివాదం తెరమీదికి వచ్చింది. దీంతో యూపి సర్కారు... సహా ఉత్తరాఖండ్.. కొంత వెనక్కి తగ్గి.. 'మీయిష్టం' అని వదిలేశాయి. కానీ, పరోక్షంగా పోలీసులు ఒత్తి చేయడం ప్రారంభించారు. ఇది గత వారం రోజులుగా రగులుతూనే ఉంది.
ఎందుకిలా?
కావడి యాత్ర చేసేవారికి ఓన్లీ వెజ్ మాత్రమే అందించాలనేది ప్రభుత్వాల ఉద్దేశం. అయితే. దీనిలోనే రాజకీయ కోణం చేరింది. మన దేశంలో ఇంకా అధీకృత ఆహార నియమాలు రాలేదు. కానీ, ఇప్పుడు అధీకృత ఆహార నియమాలు అమలు చేస్తే... అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి.. ప్రభుత్వాలు తెలివి ప్రదర్శించి.. యజమాని పేరు, ఊరు, వివరాలు రాయాలంటూ.. ఒత్తిడి చేశాయి. ఎన్నికల సమయంలో నూ ఇవి ఉపయోగపడతాయని అనుకున్నాయి. అయితే.. ఇది పెను వివాదంగా మారి.. ఉద్యమాల దిశగా దారితీయడం మొదలైంది.
ఇప్పుడు పరిస్థితి ఏంటి?
ఉత్తరాఖండ్, యూపీల్లో జరుగుతున్న ఈ వ్యవహారంపై ఎక్కడో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎంపీ మొహువా మొయిత్రా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా మరో స్వచ్ఛంద సంస్థ కూడా.. పిటిషన్ వేసింది. దీనిని విచారించిన కోర్టు.. ''యజమాని పేర్లు అవసరం లేదు.. వారు వండి వడ్డించే ఆహార పదార్థాల మెనూను బహిరంగ పరిస్తే చాలు'' అని తాజాగా తీర్పు వెలువరించింది. దీంతో కొంత మేరకు వివాదానికి కామా పడినా.. రాజకీయ కుటిలవ్యూహాలు.. వ్యక్తులను విభజించి... ఓటు బ్యాంకు పొందాలనుకునే వ్యూహాలు మాత్రం అలానే ఉన్నాయనేది స్పష్టమైంది.