కస్టడీలో ‘మోదీ’ పుస్తకం చదువుతున్న కవిత.. మరి కేజ్రీ?

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ శనివారం నుంచి మూడు రోజులు విచారించనుంది.

Update: 2024-04-13 15:30 GMT

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ శనివారం నుంచి మూడు రోజులు విచారించనుంది. ఆదివారం కూడా ఆమె కస్టడీలో ఉంటారు. కోర్టు ఆదేశాలతో శుక్రవారం సాయంత్రమే కవితను అధికారులు సీబీఐ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లారు. మద్యం విధానం రూపకల్పన, అక్రమాల్లో కవితను కీలక సూత్రధారి, పాత్రధారి అని సీబీఐ ఆరోపిస్తోంది. కస్టడీకి కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఆమెను తిహాడ్ జైలు నుంచి తరలించారు. కాగా, తాజా సమాచారం ప్రకారం అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను ప్రశ్నించనున్నారు.

కస్టడీలో ఎలా..?

ఒక దశలో ప్రజా ప్రతినిధిగా నిరంతరం ప్రజల్లో ఉన్న కవిత.. కస్టడీలో ఏం చేయనున్నారు? అనేది ఆసక్తికరం. అయితే, కోర్టు ఆమెకు కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ప్రతి 48 గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. రోజూ సాయంత్రం 6 -7 గంటల వరకు న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతిచ్చింది. కవిత న్యాయవాది మోహిత్ రావు, భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, పీఏ శరత్‌చంద్రలకు అనుమతి లభించింది. ఇంటి భోజనం తీసుకొచ్చేందుకు విద్యానిధి పరాంకుశానికి సైతం అనుమతి ఇచ్చింది. వీరు కలిసే సమయంలో సీబీఐ అధికారులు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేసింది.

జపమాల.. దుస్తులు.. పుస్తకాలు

కస్టడీలో ఉండగా కవిత జపమాల, దుస్తులు, పరుపు, బెడ్‌షీట్లు, టవల్స్, దిండ్లను కూడా ఉపయోగించుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే, దీంతోపాటు ది పారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్, ఎలాన్ మస్క్, ది నట్‌ మెగ్స్ కర్స్, రెబెలా ఎగెనెస్ట్ ది రాజ్, రోమన్ స్టోరీస్ పుస్తకాలు చదువుకునేందుకు ఓకే చెప్పింది. కాగా, కవిత చదువుకునేందుకు ఎంచుకునే పుస్తకాల్లోనే ఓ ట్విస్టుంది. ‘‘ది పారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్’’ అనేది ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ రాసిన పుస్తకం ఇది. మోదీ విధానాలను తీవ్రంగా విమర్శించే థరూర్.. మోదీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటూ పుస్తకం రాశారు. ఉదారవాద అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. సుపరిపాలన గురించి గొప్పలు పోతూ.. మత ఘర్షణలను ప్రేరేపించేలా చేశారంటూ ధ్వజమెత్తారు. మోదీ విధానాలను ఆసాంతం తూర్పారపడుతూ థరూర్ రాసిన ఈ పుస్తకం ఆన్ లైన్ లోనూ అందుబాటులో ఉంది. ఇప్పుడు దీనినే కవిత కస్టడీలో చదివేందుకు ఎంచుకోవడం గమనార్హం.

మరి కేజ్రీవాల్?

ఢిల్లీ మద్యం విధానంలో అరెస్టయిన కేజ్రీవాల్ కూడా కస్టడీలో ఉండగా కొన్ని పుస్తకాలు కావాలని కోరారు. తిహాడ్ జైలులోనే ఆయన ఈ నెల 15 వరకు కస్టడీలో ఉండనున్నారు. కాగా, కేజ్రీ తనకు మూడు పుస్తకాలు కావాలని న్యాయ‌వాదుల ద్వారా కోర్టును కోరారు. అవి భ‌గ‌వ‌ద్గీత, రామాయ‌ణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్. మొదటి రెండు హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గ్రంథాలే. ఇక మూడోదైన ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ అనే పుస్తకమే విలక్షణమైనది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వీపీ సింగ్, పీవీ నరసింహారావు, వాజ్ పేయీ, మన్మోహన్ సింగ్ ప్రధానులుగా తీసుకున్న అత్యంత కీలక నిర్ణయాలు దేశ గతిని ఎలా మార్చాయి? అనేదే ఈ పుసక్త సారాంశం.

కొసమెరుపు: ఒకే ప్రధాని (మోదీ)కి తీవ్ర ప్రత్యర్థులుగా ఉంటూ.. ఆయన హయాంలోనే ఒకే కేసులో అరెస్టయి.. ఒకే జైలులో ఉన్న ఇద్దరు రాజకీయ నాయకులు.. ప్రధాన మంత్రులకు సంబంధించిన పుస్తకాలు చదవడం.

Tags:    

Similar News