అధికారంలో ఉంటే అందరివాళ్లు.. పత్రిపక్షంలో ఉంటే అంధ్రావాళ్లా?
కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ అధిష్ఠానం అధికారికంగా స్పందిస్తుందో లేదో చూడాలి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాల పరిమితి ముగిసి.. రెండుచోట్లా మూడో విడత ప్రభుత్వాలు కొలువుదీరిన సమయంలో తాజాగా ‘ఆంధ్రా’ పదం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. అదే పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఉద్దేశించి ఆంధ్రా వాడు అనే పదం వాడడం రాజకీయాల్లో మళ్లీ ప్రాంతీయవాదానికి కారణం అవుతోందా? అనే సందేహం కలిగిస్తోంది.
బీఆర్ఎస్ అధికారిక స్పందన ఏమిటో?
కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ అధిష్ఠానం అధికారికంగా స్పందిస్తుందో లేదో చూడాలి. కౌశిక్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మందలించినట్లు ఇప్పటికే కథనాలు వస్తున్నాయి. అయితే, అధికారంలో ఉన్న పదేళ్లు ఆంధ్రావాళ్లను, ఆంధ్రా మూలాలు ఉన్నవారిని బీఆర్ఎస్ పల్లెత్తు మాట అనలేదు. నాలుగేళ్ల కిందట జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బీజేపీ దూకుడు నుంచి కాపాడింది ఆంధ్రా వాసులు అధికంగా నివాసం ఉండే ప్రాంతాలే కావడం గమనార్హం. అంతెందుకు నిరుటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ కు గ్రేటర్ హైదరాబాద్ లోనే అధిక సీట్లు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. అలాంటిది ఇప్పుడు కౌశిక్.. చేసిన ఒక్క వ్యాఖ్య ఆ పార్టీ విధానం ఏమిటనే ప్రశ్న లేవనెత్తేలా చేస్తోంది.
ప్రతిపక్షంలో ఉంటేనే తెలంగాణవాదమా?
తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటై జాతీయ పార్టీగా ఎదిగేందుకు ప్రయత్నించిన కేసీఆర్ పార్టీకి.. ప్రతిపక్షంలోకి వచ్చాక అంతా తలకిందులుగా మారింది. దీంతో మళ్లీ తెలంగాణ వాదం వినిపించేందుకు సిద్ధం అవుతోందనే ఊహాగానాలు వచ్చాయి. వీటిపై ఖండనలు ఏమీ రాకున్నా.. కౌశిక్ రెడ్డి ద్వారా ఆ మేరకు సంకేతాలు పంపుతున్నారా? అనే సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలంగాణ వాదమా? అనే ప్రశ్నలు వేస్తున్నారు. అధికారంలో ఉండగా అందరివాళ్లం అని చెప్పి.. పవర్ పోయాక ఆంధ్రావాళ్లు అని అంటారా? అంటూ కొందరు మరింత నిష్టూరం ఆడుతున్నారు.