కేటీఆర్ హరీష్ రావు : బావా బావమరుదులకు రాష్ట్రంలో చెరిసగం...కేసీఆర్ డిసైడెడ్!

అదేదో పాత సినిమాలో వాణిశ్రీ పాత్ర అంటుంది. రాష్ట్రం రాసిచ్చేస్తాను అని. ఇపుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరు చూస్తే అదేలా అనిపిస్తోంది అని అంటున్నారు

Update: 2024-11-06 14:30 GMT

అదేదో పాత సినిమాలో వాణిశ్రీ పాత్ర అంటుంది. రాష్ట్రం రాసిచ్చేస్తాను అని. ఇపుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరు చూస్తే అదేలా అనిపిస్తోంది అని అంటున్నారు. తెలంగాణాను ఇద్దరు నాయకులకు ఆయన చెరి సగం రాసిచ్చేస్తున్నారా అన్నది అయితే అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది. బీఆర్ఎస్ లో కేటీఆర్ హరీష్ రావు కీలకంగా ఉన్నారు.

ఈ ఇద్దరూ బావా బావమరుదులు. ఇద్దరి మధ్యన పోటీ అయితే ఒక లెవెల్ లో ఉంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి బీఆర్ఎస్ అధిపత్యం అంటే అసలు కుదిరేది కాదు. పైగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు అయి బీఆర్ఎస్ చతికిలపడిపోయింది. దాంతో ఈ ఇద్దరినీ ముందు పెట్టి రాజకీయం చేయాలన్నది పెద్దాయన కేసీఆర్ తాపత్రయం గా కనిపిస్తోంది.

దాంతో ఆయన రాష్ట్రాన్ని రెండు భాగాలుగా చేసి కేటీఆర్ హరీష్ రావులకు రాజకీయం కోసం అప్పగిస్తున్నారు అని అంటున్నారు. కేటీఆర్ ఇటీవల తాను పాదయాత్ర చేస్తాను అని ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే దాని మీద హరీష్ రావు వర్గం గుర్రు మీద ఉంది అని అంటున్నారు.

పాదయాత్ర అంటే బీఆర్ఎస్ భావి లీడర్ గా కాబోయే సీఎం గా ఎస్టాబ్లిష్ కావడమే అన్నది తెలుసు కనుకే హరీష్ రావు వర్గం దీని మీద మల్లగుల్లాలు పడుతోంది అని అంటున్నారు. ఇక కేటీఆర్ పాదయాత్ర రూట్ మ్యాప్ కి అంతా సిద్ధం అవుతోందని దానికి తగిన యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టమని కూడా తన అనుచరులతో కేటీఆర్ చెప్పినట్లుగా సైతం ప్రచారం సాగింది.

ఇంకేముందు కొత్త ఏడాదిలో కేటీఆర్ పాదయాత్ర ఖాయమని అంతా అనుకుంటున్న నేపథ్యంలో ఇపుడు పెద్దాయన కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారు అని అంటున్నారు. ఆయన పార్టీలో వర్గ పోరు ముదరకుండా అదే విధంగా కేటీఆర్ హరీష్ రావు అంటూ గులాబీ తోటలో విభేదాలు చెలరేగకుండా కొత్త మార్గాన్ని కనుగొన్నారు అని అంటున్నారు.

ఆ కొత్త రూటే రాష్ట్రాన్ని రెండుగా చేసి ఇద్దరు నేతలకు పంచడం అన్న మాట. దీంతో ఇపుడు పాదయాత్రకు కేసీఆర్ రూట్ మ్యాప్ ని ఇస్తున్నారని ప్రచారం సాగుతోంది. తెలంగాణాను రెండుగా చేసి ఉత్తర తెలంగాణాలో కేటీఆర్ పాదయాత్ర చేయమని అలాగే దక్షిణ తెలంగాణాలో పాదయాత్రను హరీష్ రావుని చేయమని కేసీఅర్ రూట్ క్లియర్ చేశారు అని అంటున్నారు.

ఈ మేరకు గులాబీ బాస్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఈ ఇద్దరి నేతలను ఆ విధంగా సమ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చూపిస్తూ జనంలోకి పంపాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. బీఆర్ఎస్ కి ఈసారి దక్షిణ తెలంగాణా పెద్ద షాక్ ఇచ్చేసింది. ఉత్తర తెలంగాణాలో కూడా హైదరాబాద్ మొత్తం జై కొట్టింది కానీ మిగిలినవి హ్యాండ్ ఇచ్చేశాయి.

దాంతో మొత్తంగా పట్టు పెంచుకోవాలీ అంటే దక్షిణ తెలంగాణాకు హరీష్ రావు బెస్ట్ అని అంచనా కట్టి అక్కడకు మేనల్లుడిని పంపుతున్నారని అంటున్నారు. అలాగే ఉత్తర తెలంగాణాలో ఎక్కువగా సిటీ నేపధ్యం ఉంది కాబట్టి కేటీఆర్ ని కనెక్ట్ చేయాలని చూస్తున్నారు అని చెబుతున్నారు.

ఈ మేరకు కేసీఆర్ సీరియస్ గానే ఇద్దరినీ రంగంలోకి దించాలని చూస్తున్నారు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతే కాదు పాదయాత్ర రూట్ మ్యాప్ తో పాటు షెడ్యూల్ మొత్తం కూడా కేసీఆర్ దగ్గరుండి ఖరారు చేశారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కేసీఆర్ బిగ్ ప్లాన్ లో భాగంగా పార్టీలో ఇద్దరు నేతలను ముందుకు పంపుతున్నారని అంటున్నా అదే సమయంలో బావా బావమరుదుల కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడమేంటి గులాబీ బాసూ అని అంటున్న వారూ ఉన్నారని టాక్.

Tags:    

Similar News