జరగబోయేవి జమిలి ఎన్నికలు...కేసీఆర్ జగన్ ఎటు వైపు ?

ఈ కమిటీకి అధ్యక్షుడిగా మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ని నియమించింది.

Update: 2024-07-29 04:07 GMT

దేశంలో 2029 నాటికి జమిలి ఎన్నికలు జరగబోతున్నాయని అంటున్నారు. అసలు 2019 నుంచే కేంద్రంలోని బీజేపీ ఆ దిశగా ఆలోచనలు చేస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చివరి ఏడాది మాత్రమే బీజేపీ జమిలి ఎన్నికల మీద కార్యాచరణకు సిద్ధం అయింది. దాని సాధ్యాసాధ్యాలు మీద ఒక కమిటీని వేసి అధ్యయనం చేయిస్తోంది.

ఈ కమిటీకి అధ్యక్షుడిగా మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ని నియమించింది. ఆయన నాయకత్వంలో కమిటీ ఇప్పటికే ఆ దిశగా భేటీలు వేస్తూ కసరత్తు చేస్తోంది. ఇది ఒక కొలిక్కి వచ్చి 2029 నాటికి దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.

అంటే అసెంబ్లీలకు పార్లమెంట్ కి ఒకేసారి ఎన్నికలు అన్న మాట. ఆ విధంగా చూస్తే జాతీయ రాజకీయాల ప్రభావం ప్రాంతీయంగా పడుతుంది. అలాగే కూటముల మధ్యనే పోరుకు ఆస్కారం ఉంటుంది. జాతీయ స్థాయిలో 2019 కంటే 2024 ఎన్నికల్లో ఆ తరహా రాజకీయ పోరు కనిపించింది.

దేశంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి అలాగే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ఉన్నాయి. దేశంలో యాభైకి పైగా పార్టీలు గుర్తింపు పొందినవి ఉంటే ఇందులో అరడజన్ కంటే తక్కువ పార్టీలే ఏ కూటమిలో లేకుండా ఉన్నవి కనిపిస్తున్నాయి. మిగిలిన పార్టీలు అన్నీ కూడా కూటములను ఎంచుకుని చేరిపోయినవే.

ఏపీలో చూస్తే తెలుగుదేశం, జనసేన బీజేపీ కూటమి కట్టాయి. మరో వైపు వామపక్షాలు కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నాయి. 2024లో కూడా ఆ పార్టీలు కలిసే ఏపీలో పోటీ చేశాయి. ఇక ఒంటరిగా పోటీ చేసింది వైసీపీ. ఘోర పరాజయం పాలు అయింది కూడా.

ఇక వైసీపీ తన ఉనికిని బలంగా చాటుకోవాలనుకున్నా అలాగే 2029 ఎన్నికల్లో అధికారం దిశగా అడుగులు వేయాలన్నా కూడా ఏదో ఒక కూటమిలో చేరితేనే తప్ప సాధ్యపడక పోవచ్చు అని అంటున్నారు. ఎన్డీయే కూటమి చూస్తే టీడీపీ జనసేన వంటి ప్రాంతీయ పార్టీలతో ఉంది. ఆ రెండూ వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలు. పైగా అవి కూడా అధికారం కోసమే పోటీ చేసే పార్టీలు కాబట్టి ఎన్డీయేలో వైసీపీకి చోటు దక్కే చాన్సే లేదు.

ఇక మిగిలింది ఇండియా కూటమి మాత్రమే. ఈ కూటమిలో వైసీపీ చేరితే ఏపీలో కాంగ్రెస్ వైసీపీ వామపక్షాలు కలిపి 2029 నాటికి బలమైన కూటమిగా మారుతాయి. అపుడు ఈ రెండు కూటముల మధ్య పోరు సాగితే ఎవరిది విజయం అన్నది కాలం నిర్ణయిస్తుంది. మరో వైపు చూస్తే కూటమిలో లేకుండా విడిగా వైసీపీ పోటీ చేస్తే జాతీయ రాజకీయాలు ప్రభావితం చేసే జమిలి ఎన్నికల్లో భారీ ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. దాంతో ఇప్పటి నుంచే వైసీపీ అధినాయకత్వం ఆ దిశగా ఆలోచించాలని అంటున్నారు.

ఇక తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ కూడా ఏ కూటమిలోనూ లేదు. పైగా ఏపీలో జగన్ కి ఉన్న వెసులుబాటు కూడా కేసీఆర్ కి లేదు. ఎందుకంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరినా బీజేపీ తెలంగాణ లో అధికారాన్ని ఆశిస్తుంది. అలాగే కాంగ్రెస్ ఉన్న ఇండియా కూటమిలో చేరినా కూడా తెలంగాణాలో అధికారం మీద ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది.

ఏపీతో పోల్చితే బీజేపీ కాంగ్రెస్ తెలంగాణాలో బలమైన పార్టీలుగా ఉన్నాయి. అవి పొత్తు పార్టీలుగా ఉంటూ జూనియర్ పార్టనర్స్ గా ఉండడానికి వీలు ఉండదు. సో కేసీఆర్ కి ఈ ఇబ్బంది ఉంది. అయితే సీట్ల సర్దుబాటు చేసుకుని చెరి సగం అధికారం పంచుకోవడం కేంద్రంలో అధికారంలో వాటా తీసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అలా చూస్తే కనుక కేసీఆర్ ఎన్డీయేలో చేరుతారా లేక ఇండియా కూటమిలో చేరుతారా అన్నది చర్చగా ఉంది.

దేనిలోనూ చేరకుండా ఒంటరిగా పోటీ చేస్తే జమిలి ఎన్నికల నేపథ్యంలో రెండు బలమైన కూటముల మధ్య పోరులో మరోసారి బీఆర్ ఎస్ రాజకీయంగా తీవ్ర నష్టాన్ని చూడాల్సి ఉండొచ్చు అని అంటున్నారు. మొత్తానికి రెండు పార్టీలు రెండే కూటములు అన్న లెక్కల కోసమే బీజేపీ కోరి మరీ జమిలి ఎన్నికలను తీసుకుని వస్తోందని అంటున్నారు. ఏ విధంగా చూసినా అది ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి ముప్పుగానే ఉంటుంది.

Tags:    

Similar News