నెట్ లో క్లిక్ కొడితే కేసీఆర్ బొమ్మ రావాల్సిందే
నాలుగైదు రోజులుగా.. గూగుల్ దేన్ని బ్రౌజ్ చేసినా.. ఏ వీడియో కోసం వెతికినా.. ఏ వెబ్ సైట్ ఓపెన్ చేసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మ కనిపించటం.
ప్రత్యర్థి అయినా పని బాగా చేస్తున్నప్పుడు పొగడటానికి మించిన సుగుణం ఇంకేం ఉంటుంది. రాజకీయాల తీరు పూర్తిగా మారిపోయిన వేళ.. ప్రత్యర్థుల్లోని మంచి గుణాల్ని ప్రస్తావించటం ఇప్పట్లో అసాధ్యం. అయితే.. ప్రత్యర్థుల బలాల్ని గుర్తించటంలో తప్పులు జరిగితే అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉందంటున్నారు.
తెలంగాణ అధికార పక్షంగా బీఆర్ఎస్ విషయానికి వస్తే.. దాని ప్లానింగ్.. దాని దూకుడు విషయంలో మిగిలిన పార్టీలు అందుకోలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఆ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తుందన్న మాట ప్రతి చోట వినిపిస్తున్న వేళ.. నిరుత్సాహానికి గురి కాకుండా.. నీరసపడిపోకుండా.. అదంతా ఉత్త ప్రచారం.. గాలి మాటలు నమ్మొద్దంటూ అంతకు రెట్టింపు శక్తియుక్తులతో గెలుపు కోసం ప్రయత్నిస్తున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని సాపేక్షంగా చూసినప్పుడు.. ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత.. కాంగ్రెస్ పార్టీ మీద సానుకూలత వ్యక్తమవుతోంది. అయితే.. కాంగ్రెస్ అభ్యర్థుల్లో పోరాట పటిమ కనిపించని పరిస్థితి. అందుకు భిన్నంగా బీఆర్ఎస్ నేతలు వ్యతిరేక గాలిలోనూ పోరాట స్ఫూర్తినిప్రదర్శిస్తూ.. ఆఖరి బంతి వరకు వదిలేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి తగ్గట్లే.. అధికార పార్టీ సైతం అలాంటి తీరునే ప్రదర్శిస్తోంది. సోషల్ మీడియా ప్రచారంలో కాస్త వెనుకబడిపోయరన్న మాట వినిపించిన వేళ.. వెంటనే అలెర్టు అయిన ఆ పార్టీ ఇప్పుడు అనుసరిస్తున్న విధానాల్ని చూస్తే అచ్చెరువు చెందాల్సిందే.
నాలుగైదు రోజులుగా.. గూగుల్ దేన్ని బ్రౌజ్ చేసినా.. ఏ వీడియో కోసం వెతికినా.. ఏ వెబ్ సైట్ ఓపెన్ చేసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మ కనిపించటం.. కారు గుర్తుకే ఓటేయాలన్న ప్రచార టెంప్లట్స్ దర్శనమిస్తున్నాయి. ఇదంతా చూస్తే.. బీఆర్ఎస్ ప్లానింగ్ కు వావ్ అనాల్సిందే. మొదట్లో కాంగ్రెస్ డిజిటల్ ప్రచార హోరు కొంత ఉన్నప్పటికి.. ఇప్పుడు మాత్రం ఏకపక్షంగా గులాబీ డామినేషన్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. నెట్ లోకి వెళ్లి క్లిక్ కొడితే చాలు.. సదరు వ్యక్తి కోరుకున్నదే కాదు.. దానికి బ్యాక్ గ్రౌండ్ లో కేసీఆర్ బొమ్మ.. కారు గుర్తుకే ఓటేయాలన్న మాట అదే పనిగా వినిపించటం విశేషం. గులాబీ దూకుడు ముందు మిగిలిన పార్టీలు తేలిపోతున్నట్లుగా చెబుతున్నారు.