ఉద్యమ కేసీఆర్ ను చూస్తారట.. పదేళ్లు ఎక్కడికి వెళ్లాడు సారూ?

తన నోటి మాటలతో ప్రత్యర్థులకు ఆయుధాల్ని చేతికి ఇస్తున్న వైనాన్ని ప్రశ్నిస్తున్నారు.

Update: 2024-04-19 05:30 GMT

నోటి మాటకు మించిన ప్రమాదకరమైన అంశం మరొకటి ఉండదన్న విషయాన్ని వేల పుస్తకాల్ని మదించిన కేసీఆర్ మాస్టారు ఓటమి తాలుకు ఫస్ట్రేషన్ లో తనకున్న జ్ఞానాన్ని మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. తానేం మాట్లాడుతున్నానన్న సోయి లేకుండా ఆయన మాట్లాడుతున్నారా? అన్న సందేహం కలిగేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడిన మాటల్లో కొన్నిమాటలు ఆయన ఇమేజ్ నున దారుణంగా దెబ్బ తీస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మళ్లీ పాత కేసీఆర్ ను చూడబోతున్నారన్న ఆయన.. ‘‘ఉద్యమ కాలం నాటి నాయకుడిని చూస్తారు’’ అంటూ చేసిన వ్యాఖ్యలపై విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తన నోటి మాటలతో ప్రత్యర్థులకు ఆయుధాల్ని చేతికి ఇస్తున్న వైనాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఉద్యమ కేసీఆర్ త్వరలో బయటకు వచ్చేటట్లు అయితే.. ముఖ్యమంత్రిగా పదవీ కాలంలో ఉన్న కేసీఆర్ ఎవరు? ఆ పదేళ్లలో ఉద్యమ కేసీఆర్ లేరా? ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్లాడీ ఉద్యమ కేసీఆర్? అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారం లేకుంటే ఉద్యమ కేసీఆర్ బయటకు రావటం.. పవర్ చేతిలో ఉన్నప్పుడు ఎక్కడికి పోతాడు? ఇలాంటి డ్యామేజింగ్ వ్యాఖ్యలు కేసీఆర్ ఎలా చేస్తారు? అన్నది ప్రశ్నగా మారింది.

తప్పులు జరిగినప్పుడు వినమ్రతతో ఒప్పుకుంటే అప్పటివరకు వ్యతిరేకించిన ప్రజలు సైతం సర్లేనని సర్దుకుంటారు. అందుకు భిన్నంగా అహంకారంతో కూడిన మాటలతో మొదటికే మోసం తెచ్చుకునే వైనం చూస్తే.. ఓటమి నుంచి కేసీఆర్ ఎలాంటి పాఠాలు నేర్వలేదన్న విషయం అర్థమవుతుంది. ప్రభుత్వాన్ని కూల్చే అస్త్రాలు తన వద్ద సిద్ధంగా ఉన్నాయన్న మాటల్ని తరచూ చెప్పే ధోరణితో కేసీఆర్ కొత్త ముప్పును ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వాన్ని ఖతం పట్టించేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారంటూ ఓవైపు రేవంత్ చేస్తున్న వాదనకు పెద్ద సారూ తాజా వ్యాఖ్యలు ఊతం ఇచ్చేలా మారాయని చెప్పాలి.

Tags:    

Similar News