కేసీఆర్ కు ఊర‌ట ద‌క్కేనా? టెన్ష‌న్ పెడుతున్న 'తీర్పు'

కేసీఆర్‌ పిటిష‌న్‌పై వాద‌న‌లు తాజాగా ముగిశాయి. విద్యుత్ క‌మిష‌న్ ఏర్పాటు జీవోను కొట్టివేయాల‌న్న కేసీఆర్ పిటిష‌న్ స‌రైందేన‌ని ఆయ‌న త‌ర‌ఫున న్యాయ‌వాదికోర్టుకు విన్న‌వించారు.

Update: 2024-06-28 08:50 GMT

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు టెన్ష‌న్ త‌ప్ప‌డం లేదు. ప్ర‌స్తుత రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం గ‌తం లో తీసుకున్న విద్యుత్ నిర్ణ‌యాల‌పై నిజానిజాల‌ను వెలుగులోకి తెచ్చే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన విష యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌ధానంగా భ‌ద్రాద్రి త‌దిత‌ర విద్యుత్ ప్రాజెక్టుల‌పై విచార‌ణ‌కు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ న‌ర‌సింహా రెడ్డి నేతృత్వంలో విచార‌ణ క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసింది. అయితే...తొలి నాళ్ల‌లో దీనిని స్వాగ‌తించిన బీఆర్ ఎస్ .. త‌ర్వాత‌.. వ్య‌తిరేకించింది.

ముఖ్యంగా.. బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించేందుకు క‌మిష‌న్ రెడీ కాగానే.. బీఆర్ ఎస్ స‌భ్యులు యూట‌ర్న్ తీసుకున్నారు. క‌మిష‌న్‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి కాంగ్రెస్ కూడా దీటుగా కౌంట‌ర్ ఇస్తోంది. మీరు వేయ‌మంటేనే క‌మిష‌న్ వేశామ‌ని అధికార ప‌క్షం చెబుతోంది. ఈ ర‌గ‌డ ఇలా సాగుతుండ‌గానే.. మ‌రోవైపు మాజీ సీఎం కేసీఆర్‌.. హైకోర్టును ఆశ్ర‌యించారు. క‌మిష‌న్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరారు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగింది.

కేసీఆర్‌ పిటిష‌న్‌పై వాద‌న‌లు తాజాగా ముగిశాయి. విద్యుత్ క‌మిష‌న్ ఏర్పాటు జీవోను కొట్టివేయాల‌న్న కేసీఆర్ పిటిష‌న్ స‌రైందేన‌ని ఆయ‌న త‌ర‌ఫున న్యాయ‌వాదికోర్టుకు విన్న‌వించారు. అదేవిధంగా జ‌స్టిస్ ఎల్ న‌ర‌సింహారెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌ను వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాలంటూ.. జారీ చేసిన నోటీసులు ర‌ద్దు చేయాల‌ని కోరారు. విద్యుత్ క‌మిష‌న్ చైర్మ‌న్ ఏక‌ప‌క్ష ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కోర్టుకు తెలిపారు. విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను క‌మిష‌న్ ప్ర‌శ్నించ‌లేద‌న్నారు.

అయితే.. అధికార ప‌క్షం త‌ర‌ఫున కూడా వాద‌న‌లు బ‌లంగానే సాగాయి. క‌మిష‌న్ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. నాటి ప్ర‌భుత్వానికి నాయ‌కుడిగా ఉన్నందున కేసీఆర్‌ను విచార‌ణ‌కు పిలిచార‌ని తెలిపారు. కేసీఆర్ దాఖ‌లు చేసిన‌ పిటిష‌న్‌కు విచార‌ణ అర్హ‌తలేద‌న్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ త‌ర‌ఫున పాల్గొన్న లాయ‌ర్ త‌మ పిటిష‌న్‌కు విచార‌ణ అర్హ‌త ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఇరు ప‌క్షాల వాద‌న‌లు ముగియ‌డంతో హైకోర్టు తీర్పును రిజ‌ర్వ్ చేసింది. దీంతో కేసీఆర్‌కు మ‌రింత టెన్ష‌న్ ప‌ట్టుకుంది. కాగా.. హైకోర్టులో త‌మ‌కు వ్య‌తిరేకంగా తీర్పు వ‌స్తే.. సుప్రీంకోర్టుకు వెళ్లాల‌ని బీఆర్ ఎస్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది.

Tags:    

Similar News