కవితను తలుచుకుని.. కేసీఆర్ భావోద్వేగం!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. తన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ను తలుచుకుని ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. గొంతు కూడా బొంగురు పోయింది. కన్నీరు బయటకు ఉబకలేదు కానీ.. పొర అయితే కనిపించింది. కన్న కూతురు జైల్లో ఉంటే నాకు బాధ ఉండదా? అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన కవిత మార్చి 21 నుంచి తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆమె అనేక పర్యాయాలు బెయిల్ కోసం ప్రయత్నించినా.. ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
కాగా.. తాజాగా కేసీఆర్.. బీఆర్ ఎస్ పార్టీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశా్లలో పార్టీ తరఫున ఎలాంటి పంథాను అనుసరించాలనే వ్యూహాన్ని వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన కవిత విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ''నేను అగ్నిపర్వతంలా ఉన్నా. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే తెలంగాణ సాధించా'' అని తెలిపారు. అయితే.. కన్న బిడ్డ జైల్లో ఉంటే.. ఎవరికి మాత్రం బాధగా ఉండదని అన్నారు. కవిత జైల్లో ఉన్నా.. స్పందించడం లేదని కొందరు అంటున్నారని.. వారికి మనసు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంలో ఉండడం తనకు కొత్తకాదని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కదా.. రాష్ట్రాన్ని సాధించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, గతంలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే కదా.. వారు అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేల పనితీరు మెరుగు పడుతుందన్నారు. కాగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. పాలన ఏమీ బాగోలేదని తనకు కూడా సమాచారం వస్తోందన్నారు. అనేక మంది తనకు ఫోన్లు చేసి మరీ చెబుతున్నారని చెప్పారు.
రేవంత్‌రెడ్డి పాలన ఏమీ బాగోలేదని.. ఆయన పార్టీ నాయకులే చెబుతున్నట్టు కేసీఆర్ తెలిపారు. పాలనపై శ్రద్ధలేదని.. ఎంత సేపూ.. గుంజుకునే పనిలో ఉన్నాడని వ్యాఖ్యానించారు. ''శాంతి భద్రతలు ఎందుకు అదుపుతప్పుతాయి?'' అని ప్రశ్నించారు. ఇక, బీఆర్ ఎస్‌ను వీడుతున్న వారిపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దిక్కుమొక్కు లేని వారిని తీసుకువచ్చి పార్టీలో పదవులు ఇచ్చానని చెప్పారు.కానీ, వారు ఇప్పుడు పార్టీ మారి.. తెలంగాణ సమాజానికి వెన్ను విరిచే పనిలో ఉన్నారని విమర్శలు గుప్పించారు. అయినా.. తనకు వారి గురించి ఆలోచించే సమయం లేదన్నారు. కాగా.. శాసనమండలిలో బీఆర్ ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారి(గతంలో అసెంబ్లీ స్పీకర్)ని కేసీఆర్ ప్రకటించారు. ఆయన ఆధ్వర్యంలో మండలి సభ్యులు నడుచుకోవాలన్నారు.