మైలేజీ కోసం పెట్టిన కేసీఆర్ మీట్ ద ప్రెస్ డ్యామేజ్ చేసిందా?

ముఖ్యమంత్రి రేవంత్ - విపక్ష నేత కేసీఆర్ ఇద్దరి మీట్ ద ప్రెస్ లను చూసినప్పుడు తేడా కొట్టొచ్చినట్లుగా కనిపించింది.

Update: 2024-05-12 04:15 GMT

'ప్రశ్నలు అడగండి.. సమాధానాలు చెబుతా. సందేహాల్ని తీరుస్తాం.. ప్రజలకు మేం చెప్పింది తెలియజేయండి' అన్న ఎజెండాతో మీట్ ద ప్రెస్ కార్యక్రమం జరుగుతుంది. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా ఎన్నికల వేళలో ప్రతి రాజకీయ పార్టీ అధినేత నుంచి సాదాసీదా రాజకీయ నాయకుడు వరకు మీడియాకు అందుబాటులోకి వస్తారు. ప్రధానిగా పదేళ్లు ఉన్న కాలంలో జాతీయ మీడియా మొదలు ప్రాంతీయ మీడియా వరకు ఎవరిని పట్టించుకునే వారు కాదు ప్రధాని మోడీ. కొద్ది మంది అంతర్జాతీయ మీడియాతో మాట్లాడేవారు.

అలాంటి మోడీ సైతం ఈసారి ఎన్నికల వేళలో.. ప్రాంతీయ మీడియాలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వటం చూశాం. అలాంటి సందర్భంలో తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు. మీట్ ద ప్రెస్ కు.. ప్రత్యేక ఇంటర్వ్యూలకు మధ్య వ్యత్యాసం బోలెడంత ఉంటుంది. ప్రత్యేక ఇంటర్వ్యూల సందర్భంగా ముందుగా ప్రశ్నలు తెప్పించుకొని.. కొన్నింటిని ఫిల్టర్ర చేసి ఇంటర్వ్యూ ఇచ్చే వీలుంటుంది. కానీ.. మీట్ ద ప్రెస్ కు అలాంటి సౌలభ్యం ఉండదు.

తమకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కారణంతోనే మోడీ ఎక్కడా మీట్ ద ప్రెస్ ను ఏర్పాటు చేయలేదన్నది మర్చిపోకూడదు. తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ తాజా ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం రాత్రి వేళలో మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే.. శనివారం ఉదయం కేసీఆర్ ఇదే కార్యక్రమాన్నినిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ - విపక్ష నేత కేసీఆర్ ఇద్దరి మీట్ ద ప్రెస్ లను చూసినప్పుడు తేడా కొట్టొచ్చినట్లుగా కనిపించింది.

మీరు ఏదైనా అడగండి అంటూ స్వేచ్ఛను ఇవ్వటం.. రిపోర్టర్ అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వటంతో పాటు.. వారి మనసుల్ని గాయపరిచేలా మాట్లాడే ధోరణి రేవంత్ ప్రదర్శించలేదు. అందుకు భిన్నంగా కేసీఆర్ మీట్ ద ప్రెస్ కార్యక్రమం సాగిందని చెప్పాలి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రదర్శించే అహంకారాన్ని ఇసుమంత కూడా తగ్గించుకోకుండా.. అదే తీరును జర్నలిస్టుల వద్ద ప్రదర్శించారు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో కీలక అధికారిగా ఉన్న రాధాకిషన్ రావు గురించి ప్రశ్నించిన సందర్భంలోనూ మరికొన్ని ఇతర సందర్భాల్లోనూ రిపోర్టర్లపై కేసీఆర్ నోరు పారేసుకోవటం లైవ్ లో చూసిందే.

అంతేకాదు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమార్తె కవితకు కేసీఆర్ ఇచ్చిన సర్టిఫికేషన్ తో పాటు.. ఆమె సుద్దపూస అని.. ఉద్యమం కోసం తన ఉద్యోగాన్ని వదిలేసి అమెరికా నుంచి వచ్చారంటూ అమితంగా ప్రశంసించారు. త్వరలోనే ఆమె కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.నిజమే.. ఇవాళ కాకున్నా ఏదో ఒక రోజున కవిత బయటకు రావటం ఖాయం. కాకుంటే.. కవిత అరెస్టు అయినప్పుడు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి సానుభూతి వ్యక్తం కాకపోవటం బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారటం చూసిందే.

ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఎప్పటిలానే తన తీరును ప్రదర్శించటం ద్వారా కేసీఆర్ కు లాభం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అహంకారమే ఆయన్ను ఓడించిందన్న మాట బలంగా వినిపిస్తున్నప్పుడు.. తన తీరును కాస్తంత మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. అదేమీ లేకుండా ఇప్పటికి తాను మారలేదన్న విషయాన్ని మీట్ ద ప్రెస్ తో కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారన్న మాట వినిపిస్తోంది. మైలేజీ కోసం ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కేసీఆర్ తీరుతో డ్యామేజ్ చేసేలా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో నిజం ఎంతన్న విషయాన్ని వచ్చే నెలలో విడుదలయ్యే ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తాయని చెప్పాలి.

Tags:    

Similar News