ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం.. డేట్ ఫిక్స్ చేసిన కేసీఆర్!
ఇదే సమయంలో కేటీఆర్ కూడా నియోజకవర్గాల వారీగా ద్వితీయ శ్రేణి నేతలతో ఫోన్ లో టచ్ లోకి వెళ్లారని కథనాలొచ్చాయి.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయం మెల్లమెల్లగా వేడెక్కుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్నే లోక్ సభ ఎన్నికల్లోనూ సాధించాలని అధికార పార్టీ ఆశిస్తుంటే... అసెంబ్లీ ఎన్నికల బాధ మరిచిపోయేలా లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆరెస్స్ భావిస్తుంది! ఈ నేపథ్యంలో ఇప్పటికే కార్యకర్తలతో పార్లమెంటు స్థానాల వారీగా కేటీఆర్, హరీష్ లు కీలక సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కేటీఆర్ కూడా నియోజకవర్గాల వారీగా ద్వితీయ శ్రేణి నేతలతో ఫోన్ లో టచ్ లోకి వెళ్లారని కథనాలొచ్చాయి.
మరోపక్క మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ శ్రేణులకు పిలుపునిచ్చారని తెలుస్తుంది. ఎంపీ స్థానాల్లో విజయమే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యవసరమైన విషయం అని గుర్తుపెట్టుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. ఏమాత్రం అలసత్వం వహించవద్దని హెచ్చరికలు కూడా జారీచేశారని అంటున్నారు. ఇలా ఎవరి వ్యూహాల్లో, ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండగా... కేసీఆర్ ఎంట్రీకి ముహూర్తం ఖారారైంది. ఇది బీఆరెస్స్ జనాలకు కచ్చితంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
అవును... తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్స్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఫిబ్రవరి 1వ తేదీన కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా ఇప్పటి వరకు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయని సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆరోగ్యం కాస్త కుదుటిపడటంతో ఆయన అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 1వ తేదీన మంచిరోజు అని.. అసెంబ్లీ స్పీకర్ చాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనువైన రోజని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. దీంతో నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఅర్ ప్రజెన్స్ ఆసక్తికరంగా ఉందబోతుందని అంటున్నారు పరిశీలకులు. అంతకంటే ముందు... లోక్ సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి పరిమిత సభల్లోనూ కేసీఆర్ పాల్గొనే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీంతో... ఆఫ్టర్ ఏ స్మాల్ గ్యాప్.. బాస్ ఈజ్ బ్యాక్ అని కామెంట్లు పెడుతున్నారు బీఆరెస్స్ కార్యకర్తలు!
కాగా, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. గజ్వేల్ తోపాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. కామారెడ్డిలో అనూహ్యంగా ఆయన ఓటమిపాలయిన ఆయన... గజ్వేల్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు!