ఆశలు వదిలేసుకున్న కేసీఆర్!
ఈ నేపథ్యంలో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని, ఆశలు వదిలేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నో ఆశలు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కోరిక. కానీ ఒకే ఒక్క ఎన్నికలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలలన్నింటినీ కూల్చేశాయి. గత తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బకు కేసీఆర్ దిమ్మ తిరిగింది. అటు అధికారం కోల్పోయి.. ఇటు పార్టీలో నుంచి జంప్ అవుతున్న నాయకులకు ఆపలేక ప్రస్తుతం కేసీఆర్ కిందా మీదా పడుతున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు షాక్ తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని, ఆశలు వదిలేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీని మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలనే ఆలోచనలో ఉన్నామని ఆ పార్టీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లో పాగా వేసేందుకు.. ఎన్‌డీఏ, యూపీఏ (ఇప్పుడు ఇండియా) కూటమికి ప్రత్యామ్నాయంగా మరో కూటమి ఏర్పాటు చేసేందుకు గతంలో కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నాయకులను కలిశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని 2022 అక్టోబర్‌లో భారత రాష్ట్ర సమితిగా మార్చారు. మహారాష్ట్రలో జోరు చూపించి కొంతమందిని బీఆర్ఎస్‌లోకి కూడా చేర్చుకున్నారు. ఏపీలోనూ బీఆర్ఎస్‌కు నాయకులను నియమించారు. కానీ గత తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ కంగుతిన్నారు.
తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతుండటంతో కేసీఆర్ ఇప్పటికైనా కళ్లు తెరిచారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ రాజకీయాల సంగతి దేవుడెరుగు.. కనీసం రాష్ట్రంలోనైనా పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు మొదలెట్టారు. అందుకే పార్టీ అస్తిత్వం కాపాడుకునేందుకు, తన ఉనికికి కారణమైన తెలంగాణను కేసీఆర్ మరోసారి ముందేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో పుట్టిన పార్టీని తిరిగి అదే పేరుతో నడిపించేందుకు సిద్ధమవుతున్నారని టాక్. పార్టీ పేరులో తెలంగాణ లేకపోవడంతో ఊహించలేనంత నష్టం జరిగిందని కేసీఆర్‌కు ఇప్పుడు అర్థమైనట్లు ఉంది. అందుకే బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చి.. పార్టీని మళ్లీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకే కేసీఆర్ సిద్ధమవుతున్నారని తెలిసింది.