కోకాపేట స్థలం యౌవ్వారం... కేసీఆర్ ప్రతివాదిగా కేసు!
ఈ సందర్భంగా తదుపరి విచారణను మరో పిటిషన్ తో అటాచ్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా బీఆరెస్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ తోపాటు ప్రధాన కార్యదర్శిపైనా కేసులు నమోదు చేయాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా తదుపరి విచారణను మరో పిటిషన్ తో అటాచ్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
అవును... బీఆరెస్స్ పార్టీకి చెందిన ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వ హయాంలో కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపుకు సంబంధించి ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టును కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించాలని.. నెంబర్ ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించిన డివిజన్ బెంచ్.. మరో పిటిషన్ ను అటాచ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
కోకాపేటలో (సర్వే నెం. 239, 240) బీఆరెస్స్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సెలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం సుమారు 11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ గతేడాది ఒక మెమో లాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి జారీ అయింది! దీంతో... రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్ ఒక్కో ఎకరానికి రూ. 3.42 కోట్ల చొప్పున మొత్తం 11 ఎకరాలకు రూ.37.53 కోట్ల మేర ధరను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
వాస్తవానికి ఆ 11 ఎకరాల భూమి ధర సుమారు రూ. 1100 కోట్ల వరకూ ఉంటుందని ఆరోపిస్తూ.. ఈ విషయాన్ని సవాలు చేస్తూ వెంకట్రామిరెడ్డి దాఖలు చేసిన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో.. రెండు పిటిషన్లను కలిపి సీజే బెంచ్ విచారించనుంది.
కాగా... ఉమ్మడి రాష్ట్రంలో 2008లో కాంగ్రెస్ పార్టీకి బౌనేపల్లి గ్రామంలో 10.15 ఎకరాల స్థలాన్ని ఒక్కో ఎకరానికి రూ.2 లక్షల చొప్పున మంజూరు చేసినట్లుగానే... బీఆరెస్స్ పార్టీ ఎక్సె లెన్స్ సెంటర్ కు 11 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న గత ప్రభుత్వ మంత్రి మండలి దీనికి ఆమోదం తెలిపింది.