కేసీఆర్‌ కు ఆ తత్వం బోధపడిందా?

పార్టీలో ఎవరూ ఉన్నా ఎవరు పోయినా తనకేం కాదని కేసీఆర్‌ వ్యవహరిస్తుండటంతోనే పరిస్థితి ముదిరి పాకానపడుతోందని అంటున్నారు.

Update: 2024-06-26 10:30 GMT

గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిని స్వయంగా ఎమ్మెల్యేగా కూడా ఓడిన కేసీఆర్‌.. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటును కూడా సాధించలేకపోయారు. మరోవైపు జంపింగ్‌ జపాంగులు చోటు చేసుకుంటున్నాయి. రాజ్యసభ సభ్యుడు, కేసీఆర్‌ కు కుడి భుజంలా వ్యవహరించిన కేకే (కంచర్ల కేశవరావు)తోపాటు భద్రాచలం, ఖైరతాబాద్, జగిత్యాల, బాన్సువాడ, స్టేషన్‌ ఘనపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, సంజయ్‌ కుమార్, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కడియం శ్రీహరి కాంగ్రెస్‌ లోకి జంప్‌ చేశారు.

పార్టీలో ఎవరూ ఉన్నా ఎవరు పోయినా తనకేం కాదని కేసీఆర్‌ వ్యవహరిస్తుండటంతోనే పరిస్థితి ముదిరి పాకానపడుతోందని అంటున్నారు. పరిస్థితులు బాగోనప్పుడు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలని.. ఇది కేసీఆర్‌ కు తెలియంది కాదని చెబుతున్నారు. అయినా సరే కేసీఆర్‌ లో అహంభావం చాయలు ఇంకా పోలేదని.. అందుకే ఆ పార్టీలో నేతలు కాంగ్రెస్‌ పార్టీలోకి జంప్‌ అయిపోతున్నారని విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేసి కాంగ్రెస్‌ లో చేరిపోయారు. మరికొందరు ఈ వరుసలో ఉన్నారని టాక్‌ నడుస్తోంది. ఇంకొందరు బీజేపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇలాగే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రధాన పోటీ కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ మధ్యే ఉంటుందని విశ్లేషణలు సాగుతున్నాయి.

Read more!

కేసీఆర్‌ వయసు రీత్యా కానీ, అనారోగ్యం రీత్యా కానీ అంతకుముందులా వాడి వేడి ఆయనలో కనిపించడం లేదని అంటున్నారు. అధికారంలో ఉన్న తొమ్మిదన్నరేళ్లు ఆయన ప్రగతి భవన్‌ లేదంటే ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌ లోనే మకాం వేశారని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతల సంగతి దేవుడెరుగు.. మంత్రులకే ఆయన దర్శనం దుర్లభమైన సందర్భాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి.

పార్టీకి తన కుమారుడు కేటీఆర్‌ ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటుగా నియమించినప్పటికీ మాస్‌ లీడర్‌ గా ఎదగడంలో ఆయన వైఫల్యం కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాస్‌ లీడర్‌ గా, సామాన్య ప్రజలు ఇష్టపడే నాయకుడిగా అవతరిస్తే .. ఈ విషయంలో కేటీఆర్‌ ఆయన దరిదాపుల్లో కూడా లేరని గుర్తు చేస్తున్నారు. అధికారం పోయినా కేటీఆర్‌ అహంకారపూరిత మాటతీరు బీఆర్‌ఎస్‌ కు నష్టం చేస్తున్నాయని అంటున్నారు.

మరోవైపు అధికారంలో ఉన్న తొమ్మిదన్నరేళ్లలో పార్టీ నాయకులకు అందుబాటులో లేకుండా వ్యవహరించిన కేసీఆరే ప్రస్తుత బీఆర్‌ఎస్‌ దుస్థితికి కారణమని చెబుతున్నారు. ముందు అధినేత మారాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన ఫామ్‌ హౌస్‌ లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, రాజ్యసభ సభ్యులను, పార్టీలో ఇతర ముఖ్య నేతలను కలవడానికి నిర్ణయించారు. వారిని ఫామ్‌ హౌస్‌ కు పిలిపించి మాట్లాడటం, కలిసి లంచ్‌ చేయడం, వారితో ఫొటోలు దిగడం వంటివి చేసి పంపించడం మొదలుపెట్టారు.

4

మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని.. ప్రజలు ఇప్పటికీ మన పక్షానే ఉన్నారని పార్టీ నేతలకు కేసీఆర్‌ చెబుతున్నారు. ఎవరూ తొందరపడి వేరే పార్టీల్లోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు.

ఇంకోవైపు రేవంత్‌ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని కేటీఆర్‌ మండిపడుతున్నారు. నైతిక విలువలు గురించి చెబుతున్నారు. అయితే ఆయనకు అంతేస్థాయిలో నెటిజన్ల నుంచి గట్టిగా కౌంటర్లు పడుతున్నాయి. తెలంగాణలో టీడీపీ శాసనసభా పక్షం అనేది లేకుండా మొత్తాన్ని బీఆర్‌ఎస్‌ లో విలీనం చేసుకున్నారని.. కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఈ నైతిక విలువలు గుర్తుకు రాలేదా అని నిలదీస్తున్నారు.

ఈ నేపథ్యంలో జంపింగ్‌ జపాంగులు మాత్రం తగ్గే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూకే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News