రామ రామ... ఆ 506 మందిలో కేసీఆర్ లేరు!
అయోధ్యలో నిర్మించిన భవ్య మందిరంలో మరికొన్ని గంటల్లో బాల రాముడు కొలువుదీరనున్న సంగతి తెలిసిందే.
అయోధ్యలో నిర్మించిన భవ్య మందిరంలో మరికొన్ని గంటల్లో బాల రాముడు కొలువుదీరనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముని భక్తులు వేయి కల్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి అతిథులుగా దేశంలోని వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలను ప్రభుత్వం ఆహ్వానించింది.
ఇందులో భాగంగా... ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న అతిథులు దాదాపు 8,000 మంది సుదీర్ఘ జాబితా ఉండగా.. ఇందులో 506 మందిని అత్యంత ప్రముఖులుగా ఎంపిక చేశారు. వీరిలో రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా, న్యాయ మొదలైన రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలకూ ఆహ్వానాలు అందాయి కానీ... కేసీఆర్ కు మాత్రం ఆహ్వానం అందలేదు!
అవును... జనవరి 22న జరగనున్న ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ నటులు, సినీ ప్రముఖులు, క్రీడాకరులకు ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. అయితే... బీఆరెస్స్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అటు ప్రభుత్వం నుంచి కానీ, ఇటు రామజన్మభూమి తీర్ధ ట్రస్ట్ కానీ ఆహ్వానించలేదు.
తాజాగా ఈ విషయాలను కేసీఆర్ కుమార్తె కవిత ధృవీకరించారు. ఇందులో భాగంగా బీఆరెస్స్ అధినేత కేసీఆర్ కు కానీ, ఆ పార్టీలోని వ్యక్తులకు కానీ, ఆయన కుటుంబ సభ్యులకు కానీ అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ఆహ్వానాలు అందలేదని స్పష్టం చేశారు! ఇదే సమయంలో ఎవరు ఆహ్వానించినా ఆహ్వానించకున్నా... కేసీఆర్ తప్పకుండా అయోధ్య రామమందిరాన్ని సందర్శిస్తారని కవిత చెప్పారు.
ఇప్పటికే అయోధ్య రామమందిర వ్యవహారాన్ని బీజేపీ తన సొంత కార్యక్రమంలా చేస్తుందని.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిర్మాణం పూర్తవ్వకుండానే ఓపెనింగ్ చేసేస్తుందని.. ఇది శుభం కాదని విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా రాజకీయ రంగు పులుముకున్న ఈ వ్యవహారంలో తాజాగా కేసీఆర్ కు ఆహ్వానం అందకపోవడం విమర్శలకు తావిస్తోంది!
కాగా... ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆదివారం సాయంత్రం అయోధ్యకు బయలుదేరి వెళ్తున్నారు. సోమవారం ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు!!