కేసీఆర్ 'రుణమాఫీ' మంత్రం.. ఏం చెప్పారంటే!
సీఎం కేసీఆర్.. తాజాగా రైతురుణమాఫీని అమలు చేసేందుకు పచ్చజెండా ఊపారు.
ఎన్నికలకు మరో 3 మాసాలే సమయం ఉంది. దీంతో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అన్ని వైపుల నుంచి తనకు సానుకూల వాతావరణం ఏర్పడేలా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా ఆయన రైతు రుణమాఫీని ప్రకటించారు.
అయితే.. వాస్తవానికి ఏడాది కాలానికి పైగానే దీనిని ప్రబుత్వం పట్టించుకోలేదు. రైతు బంధు అని ప్రత్యేక పథకం అమలు చేశారు. దీంతో రైతుల అప్పులు అలానే పేరుకుపోయాయి. ఎన్నికల సమయంలో ఇది తమకు, పార్టీకి కూడా ఎఫెక్ట్ అవుతుందని భావించిన సీఎం కేసీఆర్.. తాజాగా రైతురుణమాఫీని అమలు చేసేందుకు పచ్చజెండా ఊపారు.
కేంద్రందే తప్పు!!
ఈ క్రమంలో ఇప్పటి వరకు రైతు రుణ మాఫీని ఎందుకు ఆపాల్సి వచ్చిందో కూడా కేసీఆర్ చెప్పారు. నోట్లరద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు కారణంగానే రాష్ట్ర సర్కారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొందని.. అందుకే.. రైతులకు రుణమాఫీని చేయడంలో ఇబ్బందులు ఏర్పడి కొంత ఆలస్యమైందని కేసీఆర్ తెలిపారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో రైతు రుణ మాఫీని చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.
కేసీఆర్ ఏమన్నారు..
''రైతులకు ఇచ్చిన మామీ ప్రకారం, రుణమాఫీ పథకాన్ని కొనసాగించాం. అదే సమయంలో రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను కొనసాగిస్తున్నాం. ఆరునూరైనా రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు.దీని కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర రైతాంగం సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఆదుకుంటాం'' అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
గురువారం నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వరకు..
గురువారం(ఆగస్టు 3) నుంచి రైతులకు రుణమాఫీ చేసేందుకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని .. సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో రూ.19 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. రుణమాఫీని గురువారం నుంచే ప్రారంభిస్తామని చెప్పారు.రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ సెప్టెంబర్ రెండో వారం(దాదాపు ఎన్నికల నోటిఫికేషన్) వరకు రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్టు తెలిపారు.