కేసీఆర్ ప్రతిమాట గతాన్ని గుర్తు చేసి వెక్కిరిస్తోందట
అధికారంలో ఉన్నప్పుడు నోటి నుంచి వచ్చే మాటలు కొన్ని తప్పులున్నా పెద్దగా పట్టవు
అధికారంలో ఉన్నప్పుడు నోటి నుంచి వచ్చే మాటలు కొన్ని తప్పులున్నా పెద్దగా పట్టవు. ఎవరైనా ప్రశ్నించినా వాటిని లైట్ తీసుకుంటున్నట్లుగా.. అర్థం లేని వ్యాఖ్యలుగా కొట్టిపారేసే తీరు కనిపిస్తుంది. చేతిలో అధికారంలో లేని వేళ.. మాటల్లో దొర్లే తప్పుల్ని ఇట్టే పట్టుకోవటమే కాదు.. ప్రశ్నించే పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఈ మాటలేమీ చెప్పలేదేంటి? అన్న ప్రశ్నలు తెర మీదకు వస్తుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వెంటాడుతోంది. తాజాగా ఆయన నిర్వహించిన నల్గొండ బహిరంగ సభలో ఆయన మాట్లాడిన ప్రతి మాటకు పంచ్ పడుతోంది. ఆయన లెవనెత్తిన అంశాలను ఎదురు ప్రశ్నించే తీరు పలువురిలో వ్యక్తమవుతోంది.
నీతులు చెప్పే పెద్దమనిషి.. తొమ్మిదిన్నరేళ్లు తన చేతిలో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే ఒక్క మాటనైనా ఆచరించారా? అని ప్రశ్నిస్తున్న పరిస్థితి. నల్గొండ సభలో రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన వాడిన భాషపై విస్మయం వ్యక్తమవుతోంది.
కేసీఆర్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యల్ని చూస్తే..
- తెలంగాణకు అన్యాయం జరిగితే నా కట్టె కాలే వరకు కొట్లాడుతాను. గత సర్కారు చేసిన పనుల కంటే ఎక్కువ చేస కొత్త ప్రభుత్వం మెప్పు పొందాలి. నాలుగు మంచి పనులు చేస్తామన్న ఆరాటం ఉండాలి. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. పొద్దున లేస్తే కేసీఆర్ ను తిట్టాలని చూస్తున్నారు. నన్ను తిడితే పెద్దోళ్లు అవుతారా? అధికారం శాశ్వితం కాదు. ప్రజల హక్కులు.. నీళ్ల వాటా శాశ్వితం''
''ఈ సభ రాజకీయాల కోసం పెట్టిన సభ కాదు. క్రిష్ణా నీళ్లలో మన హక్కుల కోసం.. మన జీవన్మరణ సమస్య కోసం.. మన బతుకు కోసం పెట్టిన సభ. క్రిష్ణా నీళ్లలో మన వాటా మనకు దక్కేంతవరకు ఈ జల ఉద్యమం ఆగదు. నేను సాధించిన తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోలేను. క్రిష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాటానికి బెబ్బులిలా వచ్చాను''
''క్రిష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు సాధించేంత వరకు తాము విశ్రమించను. ముఖ్యమంత్రి నేత్రత్వంలో అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకెళ్లాలి. ప్రధానిని కలిసి నిలదీయాలి. నీటిహక్కుల కోసం కేంద్రంతో కొట్లాడాలి. ఆర్నెల్లలో నీటిహక్కులు తేల్చాల్సిందిగా కేంద్రం మీద ఒత్తిడి తేవాలి''
''కేఆర్ఎంబీ విషయంలో అనాడు కేవలం ఒక్క ఏడాది కోసం సర్దుకోవాలని కేంద్రం చెబితే.. సరేనన్నా. తర్వాత కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వందల లేఖలురాసినా స్పందించలేదు''
''అసెంబ్లీ తీర్మానంలో తెలివితక్కువతనం బయటపడింది. కేవలం నదీజలాల్లో హక్కుల అంశాన్నే తీర్మానంలో పెట్టారు. విద్యుదుత్పత్తి అంశాన్ని పెట్టలేదు. క్రిష్ణా జలాల్లో హక్కుల కోసం నల్గొండ.. ఖమ్మం.. మహబూబ్ నగర్.. రంగారెడ్డి. హైదరాబాద్ జిల్లాల ప్రజలు నిరంతరం అప్రమత్తతతో ఉండాలి''
''ముఖ్యమంత్రి.. మంత్రులు మేడిగడ్డకు ఎందుకు వెళ్లారు? ఎల్ఎండీ.. ఎంఎండీ నింపి ఐదు లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉంటే.. ఆ పని చేయకుండా మేడిగడ్డకు పోతాం. బొందలగడ్డకు పోతామంటున్నారు. అక్కడేమైనా తోకమట్ట ఉందా? అక్కడికి వెళ్లి ఏం చేస్తారు?''
''250, 300 టీఎంసీల కాళేశ్వరం ప్రాజెక్టు మూడు బ్యారేజీలు.. 200కిలోమీటర్ల టన్నెల్.. 1500 కిలోమీటర్ల కుడి కాల్వలు.. 19 సబ్ స్టేషన్లు.. 20 వరకు రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంత వ్యవస్థలో రెండు మూడు పిల్లర్లు కుంగాయి. వాటిని రిపేరు చేసి నీరివ్వాలే తప్ప.. చిల్లర రాజకీయాలు చేయటం ఏమిటి? గతంలో నాగార్జునసాగర్ లో కుంగలేదా?కడెం ప్రాజెక్టు గేట్లు కోసుకుపోలేదా? మూసీ ప్రాజెక్టు మూసుకుపోలేదా?''
కేసీఆర్ వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. సందర్భానికి తగ్గట్లు మాట్లాడే ఆయన ధోరణి కనిపిస్తుంది. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేసే ఆయన..తాను అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో ఒక్కసారైనా.. ఒక్క అంశంలో అయినా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారా? అన్నది ప్రశ్న. తెలంగాణఉద్యమ సమయంలోనూ విపక్షంలో ఉన్న ఆయన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేసేవారు. తాను అధికారంలోకి వచ్చినంతనే మర్చిపోయారు.
కేంద్రంలోని మోడీ సర్కారు ఒక్క ఏడాది ఒప్పుకోమంటే ఒప్పుకున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బ తింటాయన్న విషయంపై క్లారిటీ ఉన్న కేసీఆరే.. ఏడాదికి ఒప్పుకోవటం ఏమిటి? రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం కోట్లాడాలే కానీ ఒప్పుకోకూడదు కదా? ఒకవేళ ఒప్పుకున్నారనే అనుకుందాం.ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించి.. వారిని ఒప్పించి చేయాల్సింది కదా? ఆ విషయాలన్ని అప్పట్లో ఎందుకు చెప్పలేదు? అన్నది మరో ప్రశ్న.
కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి కీర్తిస్తూ.. అందులో రెండు మూడు పిల్లర్లు చెడిపోతే బాగుచేస్తే సరి అంటున్న ఆయన.. అధికారంలో పదేళ్లు ఉండి కూడా ప్రతి దానికి ఆంధ్రోళ్లు.. ఉమ్మడి పాలన అంటూ ప్రతి సందర్భంలో తిట్టే ఆయన.. పదేళ్లలో అంతా బాగుచేసేయలేదెందుకు? ఉమ్మడి రాష్ట్రం బాగోలేదు కనుకే విభజన చేసి కొత్త రాష్ట్రం ఇచ్చినప్పుడు.. ఆ విషయాల్ని వదిలేయొచ్చు కదా? అయినా.. చిల్లర రాజకీయం ఎందుకు చేసినట్లు?
అదొక్కటేనా? తెలంగాణ ఉద్యమ వేళలో ఉమ్మడి పాలనలో లోపాల గురించి చిప్పిన ఆయన.. ఒక్కరోజంటే ఒక్కరోజు ఇప్పటి మాదిరి జరిగిన మేళ్ల గురించి ఎందుకు చెప్పలేదు. ఎందుకంటే.. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మేలు గురించి చెప్పినంతనే తన రాజకీయ భవిష్యత్తు ఉండదు కాబట్టి. తాను వేసే ప్రతి అడుగు.. తన రాజకీయ ప్రయోజనం కోసమే తప్పించి.. మరింకేమీ కాదన్న విషయం కేసీఆర్ మాటల్లో కొట్టొచ్చినట్లుగా కనిపించటం.. తొమ్మిదిన్నరేళ్ల తన పాలనలో తాను ఎప్పుడూ అనుసరించని విధానాల్ని విపక్ష నేతగా డిమాండ్ చేయటం చూస్తేనే కేసీఆర్ రెండు నాల్కల ధోరణి ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.